- పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:రాజమహేంద్రవరంలోని కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లి ఉత్సవాలు డిసెంబరు 14 నుంచి 16 వరకు జరుగుతాయని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఉత్సవాల సన్నాహక సమావేశం శుక్రవారం సాయంత్రం గుంటూరులోని స్థానిక రైతు భవన్‌లో జరిగింది. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పరిశోధన సంస్థ ఇప్పటి వరకు 103 వంగడాలను విడుదల చేసి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. దేశానికి రూ.9700 కోట్ల వరకు విదేశీ మారక ద్రవ్యాన్ని అందించిందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 కోట్ల మందికి పొగాకు పరిశ్రమ ఉపాధి చూపిసొందన్నారు. 1947లో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన సంస్థ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారని తెలిపారు. రాజమండ్రి సిటిఆర్‌ఐకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా మరో 17 పరిశోధన సంస్థలు ఉన్నాయని తెలిపారు. ప్లాటినం జూబ్లి ఉత్సవాలకు కేంద్ర వ్యవసాయ, వాణిజ్యశాఖ మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు హాజరు అవుతారని తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ టుబాకో సైన్సెస్ ప్రెసిడెంట్ ఎం.శేషుమాధవ్ మాట్లాడుతూ.. వివిధ శాఖల సమన్వయంతో ప్లాటినం జూబ్లి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు చర్చా గోష్టులు, రైతులకు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలపై చర్చిస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల విసిలను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. సిటిఆర్‌ఐ డైరక్టర్ ఎల్.కె. ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్టు హెచ్.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.










