రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ... నవరబర్ 15 న మైలవరం నియోజకవర్గంలో చేపట్టనున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ఆంజనేయులు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం రెడ్డిగూడెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల సీనియర్ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ఆంజనేయులు మాట్లాడుతూ ...రెడ్డి గూడెం మండలంలో రైతులు పంటలు ఎండిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వ అధికారులు స్పందించి విద్యుత్ కోతలు లేకుండా కనీసం 18 గంటల విద్యుత్తును అందిస్తే మిగిలిన పంటలనైనా కాపాడుకోగలుగుతారని అన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీటి కొరతతో రైతులు నానా కష్టాలు పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులను ఆదుకోవాలంటే తక్షణమే విద్యుత్తు సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలు నియంత్రించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటైన బిఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, విమాన, ఎల్‌ఐసి, తదితర సంస్థలను కార్పొరేట్ చేయడంలో బిజెపి ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సైతం ప్రైవేటీకరణ చేయడంలో బిజెపి ముందంజలో దూసుకుపోతుందని అయినప్పటికీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. దేశంలో 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా రద్దు చేసిందని, ప్రజల వద్ద నుండి ముక్కుపిండిమరి పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను సైతం పక్కదారి పట్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటుందని ధ్వజమెత్తారు. మహిళలకు 2024 నుంచే 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో 42 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్ లు తీసుకువచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థలకు అనుగుణంగా కార్మికుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టు వర్కర్స్ కనీస వేతనం రూ.26 వేలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేయడం ఆందోళనకరమని అన్నారు. నవంబర్ 15 వ తేదీన జరిగే సిపిఎం బహిరంగ సభకు మైలవరం నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జై వెంకట్ రెడ్డి, ఉయ్యూరు కృష్ణారెడ్డి, జి.అప్పి రెడ్డి, జి.వెంకటరెడ్డి, చంద్రరావు, బాబు, కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, రామిరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి పర్మేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.










