Oct 20,2023 21:52

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం జగన్‌
ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌, వన్‌టౌన్‌:దసరా శరన్నవరాత్రుల్లో ప్రధానమైన మూలా నక్షత్రం రోజైన శుక్రవారం సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. తాడేపల్లిలోని తన నివాసం నుండి మధ్యాహ్నం 3.40 గంటలకు ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సంప్రదాయ వస్త్రధారణతో పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను తలపై పెట్టుకుని అంతరాలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. సిఎం వెంట మంత్రుల కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, జోగి రమేష్‌, ఆర్‌.కె.రోజా, ఎండోమెంట్‌ స్పెషల్‌ సిఎస్‌ ఆర్‌.కరికల్‌ వలవెన్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, నగర సిపి కాంతి రాణా టాటా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఇఒ కెఎస్‌ రామారావు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణువర్థన్‌ తదితరులు ఉన్నారు.

  • అడ్డదారి దర్శనాలకు అడ్డుకట్ట

అడ్డదారిలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్న మార్గాలకూ ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తాళాలు వేయించారు. విఐపి క్యూలైన్‌ ద్వారా ప్రొటోకాల్‌ ఉన్న వివిఐపిలకు మాత్రమే దర్శనం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. దర్శనాల విషయంలో స్వార్థంతో ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవాలయం లోపల భాగంలో కూడా అన్ని ద్వారాలూ దగ్గరుండి మూసేయించారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు దర్శనాలు ప్రారంభం కాగానే ఆయన క్యూలైన్లను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. భక్తుల రద్దీని క్రమపద్ధతిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.