Nov 02,2023 12:00

విశాఖపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 25 వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, ఐసీఐడీ ఎక్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 74వ అంతర్జాతీయ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం విశాఖకు చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఐసీఐడీ ప్రతినిధులతో కలిసి అంతర్జాతీయ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. నేటి నుంచి విశాఖ వేదికగా వారం రోజుల పాటు ఈ అంతర్జాతీయ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యమైన జల శక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింఫ్‌ు షేకావత్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఐసీఐడీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రగబ్‌ రగబ్‌, ఐసీఐడీ వైస్‌ ప్రెసిడెంట్‌ కుష్విందర్‌ వోహ్రా, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశి భూషణ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ధనుంజరు రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ హరి కిరణ్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, తదితరులు భాగస్వామ్యమయ్యారు. సుమారు 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు నిర్వాహకులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించారు.

2233

 

4455