- చురాచాంద్‌పూర్‌లో నిరవధిక బంద్ ప్రారంభం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్‌ఐఎ అరెస్టుల పర్వం అక్కడి కుకీ గ్రూపులో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. జులై నెలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతి విషయంలో సంబంధం ఉన్నదన్న ఆరోపణలపై కుకీ తెగకు చెందిన నలుగురిని సిబిఐ అరెస్టు చేయటాన్ని కుకీ ప్రజలు తప్పుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యకు స్పందనగా కుకీ గ్రూపు చురాచాంద్‌పూర్ జిల్లాలో నిరవధిక షట్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. సిబిఐతో పాటు ఎన్‌ఐఎ కూడా ఒక కుకీ వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని మణిపూర్ సిఎం బీరెన్ సింగ్ కూడా సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. చురాచాంద్‌పూర్ జిల్లాను షట్‌డౌన్ చేయాలని సంకల్పించినట్టు కుకీ సంస్థ ఇండిజీనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం (ఐటిఎల్‌ఎఫ్) ప్రకటించింది. ఎన్‌ఐఎ, సిబిఐ అరెస్టు చేసిన వ్యక్తులను 48 గంటల్లో విడుదల చేయాలని ఐటిఎల్‌ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.










