Oct 22,2023 00:32

-ఇఎస్‌ఐలో ఉన్నతాధికారుల ఆదేశం
-ఒక మంత్రి ఒత్తిడి కారణమని అనుమానాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:ఇఎస్‌ఐలో మరో మందుల స్కామ్‌కు తెరలేచిందా? తాజా పరిణామాలతో ఇఎస్‌ఐ సిబ్బందిలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని కంపెనీల మందులే కొనుగోలు చేయాలని, అవసరం లేకపోయినా తప్పనిసరిగా ఇండెంట్‌ పెట్టాలన్న ఆదేశాలు ఇఎస్‌ఐలో జారీ అయ్యాయి. ఈ రెండు, మూడు నెలల్లోపే సుమారు రూ.40 కోట్ల నుండి రూ.45 కోట్ల వరకూ విలువైన మందుల కొనుగోలు చేయాలని, ఆ మేరకు ఇండెంట్‌ పెట్టాలని అన్ని డిస్పెన్సరీలకు, సూపరింటెండెంట్లకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ ఆదేశాల వెనుక ఒక మంత్రి హస్తం ఉందన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రోగులకు అవసరమైన 279 రకాల మందులనే కొనుగోలు చేస్తుండగా తాజాగా 900 రకాల మందులు కొనుగోలు చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అదికూడా గ్లెన్‌మార్కు, శారిడా, జాన్సన్‌అండ్‌జాన్సన్‌, జిమ్‌ కంపెనీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలంటూ పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ ఆదేశాలపై కిందిస్థాయిలో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇఎస్‌ఐ మందుల కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో కార్మికశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం డిస్పెన్సరీలకు వచ్చే రోగులు వారికి వినియోగిస్తున్న మందులకు సంబంధించి 279 రకాలు మాత్రమే అవసరమౌతాయని నిర్ధారించి, ఆ మేరకే కొనుగోలు చేయాలంటూ స్పష్ట.మైన ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసి దానిలోనే ఇండెంట్‌ పెట్టాలని నిర్ధేశించారు.

  • తాజా ఆదేశాల్లో ఇలా...

తాజా ఆదేశాల్లో స్క్రూటినీ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మెడికల్‌ ఆఫీసర్లు ఇండెంట్లు పెట్టాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కాకుండా నేరుగా వచ్చి ఇండెంట్‌ ఇవ్వాలనీ సూచించినట్లు తెలిసింది. ఈనెల 11వ తేదీన 1955303/సిడిఎస్‌/డిఐఎంఎస్‌/2023 ఆర్‌సి నెంబరుతో ఈ మేరకు కడప, రాజమహేంద్రవరం, ఆదోని, విజయవాడ సూపరింటెండెంట్లకు, మెడికల్‌ ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. 45 కోట్ల రూపాయల మేరకు ఈ కొనుగోళ్లు ఉంటాయని అంచనా!
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాగే మందులు కొనుగోలు చేసి వాటి సమయం గడిచిపోవడంతో పారేశారని, ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయిన్ని
ఆ సమావేశంలో కొందరు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజంగా ఖర్చు చేయాలనుకుంటే ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని, సూపర్‌ స్పెషలిస్టుల సంఖ్యను పెంచితే ఉపయోగమని సూచించినట్లు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కొనుగోలు చేయాల్సిందేనని హుకుం జారీచేసినట్లు తెలిసింది.

  • వృద్ధా ఇలా ...

ఉదాహరణకు జిమ్‌ కంపెనీ నుండి ఎక్కువగా మల్టీవిటమిన్‌ టాబ్లెట్లు కొంటున్నారు. ఈ ఏడాదిచ కూడా అవసరాలకు సరిపడా ఇప్పటికే కొనుగోలు చేశారు. అయినా, మళ్లీ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం వాడుతున్న
279 రకాల్లో మందుల్లో అధికశాతం అవసరాల మేరకు స్టాక్‌ ఉన్నప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే రెండు, మూడు నెలల్లో అదనంగా గోలు చేయాలని ఆదేశించినట్లుతెలిసింది. కొన్ని డిస్పెన్సరీలు ఇప్పటి వరకు రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల విలువైన మందులకు మాత్రమే ఇండెంట్‌ పెడుతుండగా, వాటిని కూడా రూ.25 లక్షల నుండి రూ.40 లక్షల వరకూ ఇండెంట్‌ పెంచి మందులు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం, అదనంగా కొనుగోలు చేస్తే వాటి వినియోగం ఉండదని చెబుతున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది.