Nov 11,2023 10:57

పూలింగ్‌ ఏజెంట్ల ద్వారా గ్రామాల్లోనే సేకరణ : జిసిసి ఎమ్‌డి
ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి :   
ఈ నెల 15 నుంచి కాఫీ గింజల కొనుగోలును ప్రారంభించనున్నట్లు గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రకటించింది. కిలో పార్చుమెంట్‌ కాఫీ గింజలకు రూ.280, కిలో చెర్రీ గింజలకు రూ.145, కిలో రొబస్తా రకానికి రూ.70 ధరను ప్రకటించింది. జిసిసి ఎమ్‌డి జి.సురేష్‌కుమార్‌ ప్రజాశక్తితో మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు వెళ్లి రైతులకు జిసిసి ధర చెప్పి, కొనుగోలు చేసేలా పూలింగ్‌ ఏజెంట్లను నియమించనున్నామని తెలిపారు. గిరిజన రైతులు మార్కెట్‌కు తేవాల్సిన పనిలేకుండా గ్రామాల్లోనే కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రయివేటు వ్యాపారులు కిలో పార్చుమెంట్‌ కాఫీ గింజలకు రూ.180 నుంచి రూ.200, చెర్రీకి రూ.120 నుంచి 130, రొబస్తాకు రూ.50 చెల్లిస్తున్నారన్నారు. గతేడాది రూ.20 కోట్ల విలువైన 996 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేశామని, ఈ ఏడాది వెయ్యి మెట్రిక్‌ టన్నులకుపైగా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.