Sep 28,2023 15:33

ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిపిఎస్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ నాయకులు జీవో పత్రాలను అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ స్సందర్భంగా జిపిఎస్‌ వద్దు ఓపిఎస్‌ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ.. జిపిఎస్‌ జీవోను విడుదల చేసిన రోజును ఉద్యోగ, ఉపాధ్యాయులకు చీకటి రోజుగా అభివర్ణించారు. జిపిఎస్‌ వద్దని పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ,ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకు చీమకుట్టినట్లు కూడా లేదని ఏమాత్రం పట్టించుకోకుండా అసెంబ్లీలో జిపిఎస్‌ జీవోను అమలు చేస్తూ తీర్మానం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. గ్యారెంటీ లేని పెన్షన్‌ స్కీంకు గ్యారెంటీ పెన్షన్‌ స్కీం అని పేరు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి కానీ అధికారం చేపట్టినప్పుడు మాట మార్చి ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమారడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిపిఎస్‌ విధానం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు లేదని ఉద్యోగులతో కంట్రిబ్యూషన్‌ కట్టించుకునే విధానం దేశానికి ఆదర్శం ఎలా అవుతుందని ప్రశ్నించారు. జిపిఎస్‌ చట్టాన్ని ఉపసంహరించుకొని పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌,ఉరవకొండ జోన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, ఉమాపతి, శ్రీధర్‌, రఘు, శ్రీనివాస్‌ గుప్తా, మైలార్‌ లింగ, సంజప్ప, కార్యవర్గ సభ్యులు నాగరాజు, రాజశేఖర్‌, బండయ్య, మధుబాబు, రవి, శివ, రామచంద్ర, ఎర్రి స్వామి, రమేష్‌, ఇస్లాం భాష తదితరులు పాల్గొన్నారు.