- మత్స్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు
- ఫార్మా వ్యర్ధాలతో అంతరిస్తున్న జలచరాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఆదుకోవాలి
- ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్ వర్క్ షాప్‌లో జాతీయ నేతలు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:మత్స్యకార రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని, మత్స్యకారులను ఆదుకోవాలని పలువురు వక్తలు అన్నారు. అఖిల భారత మత్స్యకారులు, మత్స్య కార్మిక సమైక్య (ఎఐఎఫ్‌ఎఫ్ డబ్ల్యుఎఫ్) జాతీయ సమావేశాలు శుక్రవారం కాకినాడలో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సమైక్య జాతీయ అధ్యక్షులు దెబాశేష్ బర్మన్ అధ్యక్షత వహించారు. 16 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పులివిల్లై స్టాన్లీ మాట్లాడారు. బ్లూ ఎకానమీ ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఫార్మా ఇండిస్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, టూరిజం పేర్లతో సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులేటర్ జోన్ (సిఆర్‌జెడ్)కు విరుద్ధంగా అనేక కట్టడాలను నిర్మించి సముద్ర తీరప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారన్నారు. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిషేధించిన ఫార్మా ఇండిస్టీలను భారతదేశం అనుమతిస్తోందని విమర్శించారు. ఈ పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల అనేక జలచరాలు అంతరించిపోతాయని వివరించారు. మత్స్య సంపదపై ఆధారపడిన కోట్లాదిమంది మత్స్యకారులు జీవనాధారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరప్రాంతాన్ని నాశనం చేసే చర్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆలిండియా అధ్యక్షులు, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కె.హేమలత మాట్లాడుతూ.. సహజ సిద్ధమైన పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. మత్స్యకారుల ఉపాధికి భద్రతను కల్పించాలని కోరారు. మత్స్యకారులు మరణిస్తే దేశవ్యాప్తంగా ఒకే విధంగా రూ. 20 లక్షలు తక్షణ ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి అందించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మత్స్య సంపదకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధునిక వృత్తి పరికరాలు సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. ఈ వర్క్ షాప్‌లో ఫెడరేషన్ కోశాధికారి మమత, మాజీ మంత్రి, ఫెడరేషన్ త్రిపుర రాష్ట్ర అధ్యక్షులు సుదాన్‌దాస్, జాతీయ కార్యదర్శి ఉమా సర్కార్, కేరళ ప్రతినిధి బషీర్, తెలంగాణ నాయకులు, జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, కొప్పు పద్మ, ఒడిశా నుంచి ఉల్లాస్, మహారాష్ట్ర నుంచి సందీప్ పాటిల్, బీహార్ నుంచి రామ్ బాలక్, ఎపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కర్రి చంద్రశేఖర్, కొల్లాటి శ్రీనివాసరావు, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు చెక్క రమణి తదితరులు పాల్గన్నారు.
మత్స్యకార రంగాన్ని కాపాడడం కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, ఫెడరేషన్‌ను బలోపేతం చేసే దిశగా ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు జాతీయ నాయకులు తెలిపారు.










