లక్నో: టీ దుకాణంలో నగదు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ఒక మైనర్ బాలుడిని నగంగా స్తంభానికి కట్టేసి, తీవ్రంగా కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నొప్పిని భరించలేక ఆ 12 ఏళ్ల బాలుడు విలవిల్లాడుతున్నా సరే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ మౌనంగా నిలబడిపోయారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో సోమవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని రక్షించారు. వైద్య చికిత్స అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్‌పి సర్వేశ్ కుమార్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.










