- ఫలించని చర్చలు
ప్రజాశక్తి-అరకు, అనంతగిరి (అల్లూరి జిల్లా)/ అమరావతి బ్యూరో:తమ సమస్యలు పరిష్కరించాలని పర్యాటక శాఖ కాంట్రాక్టు, మ్యాన్‌పవర్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులు శనివారం సమ్మె బాటపట్టారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని పర్యాటకశాఖ హరిత హిల్ రిసార్ట్స్, పున్నమి వ్యాలీ రిసార్ట్స్, రెస్టారెంట్లు, అనంతగిరి మండలంలోని బర్రా గుహలు, టైడా మూతపడ్డాయి. అరకులోయలోని హరిత హిల్ రిసార్ట్స్, పున్నమి వ్యాలీ రిసార్ట్స్ ముఖద్వారాల వద్ద సమ్మె శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికులు కూర్చున్నారు. విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెలో పాల్గనడంతో పర్యాటక శాఖ అతిథి గృహాలు వెలవెలపోయాయి. టూరిజం కార్మికుల సమ్మె శిబిరాలను ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, కాంగ్రెస్ నాయకులు పి.చిన్నస్వామి తదితరులు సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె విరమించేది లేదని పర్యాటకశాఖ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.గంగరాజు, ప్రధాన కార్యదర్శి వి.బాబూరావు, అల్లూరి జిల్లా టూరిజం కార్మికుల సంఘం అధ్యక్షుడు నరసింహారాజు, ప్రధాన కార్యదర్శి అంజలిరావులు స్పష్టం చేశారు. సమ్మెతో ఆర్‌ఆర్ టూర్ (రైలు కం రోడ్డు) ప్యాకేజీ టూర్‌ను అధికారులు రద్దు చేశారు. అరకులోయలోని హరిత వ్యాలీలో చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర సందర్శించి మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక శాఖ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టూరిజం ఎండి కన్నబాబుతో చర్చలు జరిగినప్పుడు 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారని, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమీత్‌కుమార్ సమక్షంలో కార్మికులతో యాజమాన్య తరుపున టూరిజం ఇడి చర్చలు జరిపి నవంబర్ 5వ తేదీ లోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని పేర్కొన్నారు. అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు డి.గంగరాజు, పర్యాటకశాఖ ఆర్‌డి సమక్షంలో శుక్రవారం చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో కార్మికులు సమ్మెకు వెళ్లారని తెలిపారు. కార్మికులు చేపట్టిన సమ్మెకు సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, టోకురు సర్పంచ్ కె.మోస్య మద్దతు తెలిపారు. బర్రా గుహలు, టైడా, అనంతగిరి, హరితహిల్ రిసార్ట్స్, అరకు, గోష్టి, మయూరి, చింతపల్లి, లంబసింగిలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, రాయితీలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
టూరిజం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
అల్లూరి సీతరామరాజు జిల్లా (ఎఎస్‌ఆర్) అరకు ప్రాంతంలోని టూరిజం కాంట్రాక్ట్, మ్యాన్‌పవర్, డైలీవేజ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలు పరిష్కారం కోసం ఉద్యోగులు ఎపి టూరిజం కాంట్రాక్ట్, మ్యాన్‌పవర్, డైలీవేజ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, కాంపాషినేట్ అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, చనిపోయిన వారి దహన సంస్కారాలకు రూ.25 వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టుల్లో గిరిజనులనే నియమించాలని, టూరిజం భవనాలకు మరమత్తులు చేపట్టాలని, ఏజెన్సీ కార్మికులకు బస్సు పాస్, ఏజెన్సీ అలవెన్సు వంటి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని టూరిజం యూనిట్లతో ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అరకు, బర్రా, అనంతగిరి, టైడా తదితర గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగులు అనేక ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. రెండేళ్లుగా ఎన్ని వినతిపత్రాలిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మె అనివార్యమైందని తెలిపారు. వెంటనే ఉద్యోగుల సమస్యలపై యూనియన్ ప్రతినిధులతో టూరిజం కార్పొరేషన్ చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










