- 25న టీటీడీ ఎడి బిల్డింగ్ వద్ద నిరసనను జయప్రదం చేయండి
- తిరుపతి అభివద్ధి వేదిక పిలుపు
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అఖిలపక్షం, పలు ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. తిరుపతి అభివృద్ధి వేదిక కన్వీనర్ టి.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభివద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని, ఈనెల 25న బుధవారం టీటీడీ పరిపాలనా భవనం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, జనసేన నేత బి. మధు, వైసిపి నేత ఎస్వీయూ పాలకమండలి సభ్యులు ఎం. మధు, బిఆర్‌ఎస్ నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, ఆర్.పి.ఐ నేత పి. అంజయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఎన్ నగేష్, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి రత్నకుమార్, మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. లోకేశ్వర వర్మ, తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు తమటం రామచంద్రారెడ్డి, కవి రచయిత గొడుగుచింత గోవిందస్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతిలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. అభివృద్ధి నిరోధకుల తాటాకు చప్పుళ్ళకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జడిసి తిరుపతికి కేటాయించాల్సిన అభివద్ధి నిధుల ప్రతిపాదనలను తిరస్కరించడం తిరుపతి ప్రజల మనోభావాలను అవమానించడమేనని తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్ పి లు మొదటి నుంచి తిరుపతి అభివద్ధికి, టీటీడీ ఉద్యోగులు, ప్రజలు, యాత్రికుల పట్ల తమ బాధ్యతా రాహిత్యాన్ని చాటుకుంటూనే ఉన్నాయని, ఇది తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం టిటిడి ప్రతిపాదనను తిరస్కరించడం అంటే ప్రభుత్వం ఆడుతున్న 'డ్రామా'నా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. తిరుపతి ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి యాత్రికుల, భక్తుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కళ్యాణి డ్యాం నుంచి తమకు రావలసిన నీటిని తిరుమల కొండకు పంపడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారని గుర్తు చేశారు. టీటీడీ ఇస్తున్న నిధులు తమ ఆదాయంలో శాతం కాదని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. 500 కోట్ల ఆదాయం, 1000 కోట్ల టర్నోవర్ ఉన్న ఏ సంస్థ అయినా సామాజిక ప్రయోజనాలు కాపాడేందుకు తమ ఆదాయంలో రెండు శాతం నిధులు కేటాయించాలని 2013లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, ఆ చట్టానికి లోబడి రెండు శాతంలో ఒక శాతాన్ని తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వడం అధర్మం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్ పి లాంటి సంస్థల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోయిందని తాము భావించటం లేదని, వాస్తవంగా సి ఎస్ ఆర్ ఫండ్స్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వక్తలు గుర్తు చేశారు. ఏడాదికి రెండు శాతం నిధులను ఇస్తున్నారో వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అనుయాయ సంస్థలకు కేటాయిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి ఏ సంస్థకు, ఏ పీఠాధిపతికి, ఏ మఠాధిపతికి ఎవరికి ఎంత నిధులు కేటాయించారో వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగర ప్రజల సౌకర్యాలకు పునాది వేయడం అంటే తిరుపతికి వచ్చే యాత్రికులు, భక్తుల సౌకర్యానికి పెద్దపీట వేయడమేనని గుర్తు చేశారు. ఇప్పటికీ తిరుపతి నగరంలో పారిశుధ్య సమస్య, మంచినీటి సమస్య, కార్మికుల కొరత పీడిస్తున్న అంశాలుగా గుర్తించాలని వక్తలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ప్రజల మనోభావాలను గమనంలో ఉంచుకొని నిధుల కేటాయింపు విషయంలో పునరాలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 25వ తేదీన టీటీడీ పరిపాలన భవనం వద్ద జరిగే భారీ ధర్నా కార్యక్రమానికి తిరుపతి నగర ప్రజలు పెద్ద ఎత్తున రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వేణు, మల్లికార్జునరావు, చిన్నా, బాలాజీ, గంగులప్ప, చంద్రశేఖర్, పార్థసారథి, జనసేన నేత బి.మునస్వామి, టిఆర్‌ఎస్ నేత బెల్లంకొండ సురేష్, బీసీ సంరక్షణ సంఘం నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు.










