Jul 30,2023 08:17

పక్షులంటే ఎవరికైనా ఇష్టమే. అయితే కొన్ని పది లక్షల ఏళ్ల క్రితం జీవించిన డైనోసార్‌ల నుంచి పక్షులు పరిణామం చెందాయని.. ఊహించగలమా..?! కానీ అదే నిజమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల్లో సరీసృపాల రూపాంతరాలే పక్షులు అని రుజువైంది. ఇటీవల కొన్ని నిర్ధారణలు వాటికి బలాన్ని చేకూర్చాయి. చార్లెస్‌ డార్విన్‌ 1859లో 'ఆన్‌ ది ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌' అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. దాని ఆధారంగానే ఈ సరికొత్త పరిణామాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.
డార్విన్‌ పరిణామ సిద్ధాంతం విడుదల తర్వాత పదేళ్లకు టర్కీలో ఆయన తింటున్న పక్షి మాంసంలో వచ్చిన ఎముకను పరిశీలించారు.అది తన కార్యాలయంలో ఉన్న థెరోపాడ్‌ మెగాలోసారస్‌ (డైనోసార్‌) శిలాజాన్ని పోలి ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత శరీర నిర్మాణ శాస్త్రవేత్త థామస్‌ హెన్రీహక్సిలీ పక్షులు.. అంతరించిపోయిన డైనోసార్ల వారసులు అని సూచించారు. శతాబ్ద కాలం తర్వాత జరిగిన పరిశోధనలు హక్సిలీ ఆలోచనను నిర్ధారించాయి.

నమూనా చిత్రాలు..

చైనాలో 1998లో జరిగిన పరిశోధనలలో రెండు శిలాజాలు, కొన్నిపక్షుల ఆధారాలు థైరోపాడ్‌ డైనోసార్‌ల నమూనాలను పోలి ఉన్నాయి. వంద నుంచి ఐదొందల పౌండ్ల బరువును కలిగి టైరన్నోసారస్‌ రెక్స్‌, వెలోసిరాప్టర్‌ అనే డైనోసార్స్‌కు.. పక్షులకు చాలా దగ్గరి సంబంధం ఉందని, అవి స్కేల్స్‌తో కూడిన చర్మాన్ని, దానిపై ఈకల్లాంటి పొర కలిగి ఉండటాన్ని పక్షి పరిశోధకులు గుర్తించారు. పక్షులు డైనోసార్ల పరిణామ జీవులు అనడానికి రుజువుగా కొన్ని చిత్రాలు దొరికాయి. అవి ఈకలతో, డైనోసార్ల నుండి పరిణామం చెందినట్లు వివిధ దశలను చూపిస్తున్నాయి.

ముక్కు ఎముక..

డైనోసార్స్‌ కోల్డ్‌ బ్లడెడ్‌.. పక్షులు వామ్‌ బ్లడెడ్‌.. ఈ స్థాయికి పరిణామం చెందటానికి చాలా కాలం పట్టిందని శాస్త్రవేత్తలు విశదీకరించారు. కోల్డ్‌ బ్లడెడ్‌ జీవులకు పెద్దముక్క రంధ్రాలుండటంతో ఇవి శ్వాసించే గాలి మెదడును చల్లబరుస్తుంది. ఈ విషయం శ్వాసకోశ టర్బినేట్‌ (మెత్తని కణజాలంతో ఏర్పడిన ముక్కు లోపలి ఎముక) పనితీరును బట్టి కనుగొన్నట్లు రాయల్‌ సొసైటీ ఓపెన్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం నివేదించింది. ఈ నివేదిక సహాయంతోనే మెదడు పరిణామంపై పరిశోధనలు జరిగాయి.

2

పిండం మాదిరి..

కొన్ని దశాబ్దాలుగా పక్షులు, డైనోసార్‌ల మధ్యనున్న సారూప్యతపై పరిశోధనలు జరుగుతున్నాయి. 'డైనోసార్‌ల అవయవాలన్నీ.. ముఖ్యంగా పుర్రె, పక్షుల పుర్రెగా పరిణామం చెందడానికి పట్టిన కాలం డైనోసార్‌ పురాజీవ శాస్త్రంలో ప్రధానమైనదనీ' టోక్యో, జపాన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచర్‌ అండ్‌ సైన్స్‌ పరిశోధకుడు సీషిరో టాడా చెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధనలలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. పక్షుల పూర్తి నిర్మాణం డైనోసార్‌ పిండాన్ని పోలి ఉంది.1990వ దశకంలో చైనాలో జరిగిన పరిశోధనల్లో డైనోసార్‌లకు పక్షుల్లా రెక్కలు లేవుగానీ, ఈకలతో కూడిన రెక్కల్లాంటి భాగాలున్నాయి.

పరిణామాత్మక విప్లవం..

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పాలియోంటాలజిస్ట్‌ స్టీఫెన్‌ బ్రుసాట్‌, ఆయన బృందం కోయెలురోసార్‌ల (థెరోపాడ్‌ రకానికే చెందినది) శిలాజాలను పరిశీలించారు. వీరి అధ్యయనం ప్రకారం, బైపెడల్‌ లోకోమోషన్‌, ఈకలు, విష్‌బోన్‌, క్విల్‌-పెన్‌ ఈకలు, రెక్కలు ఇవన్నీ దశలవారీగా నెమ్మదిగా అభివృద్ధి చెందాయి. ఇవి ఆర్కియోప్టెరిక్స్‌ (పురాతన పక్షులు) గా పరిణామం చెందాక, వేగంగా మార్పులు జరిగాయి. 'పక్షుల శారీరక నిర్మాణం ఏర్పడడం.. కొత్త జీవావరణ వ్యవస్థ.. ఒక పరిణామాత్మక విప్లవానికి దారితీసింది' అంటారు బ్రూసాట్‌. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌ యూనివర్శిటీ సైంటిస్ట్‌ మైఖేల్‌ బెంటన్‌ పరిశోధనలూ బ్రూసాట్‌ అధ్యయనాలతో సరిపోలాయి.
కొన్ని కోయిలురోసార్‌లు 200 మిలియన్‌ సంవత్సరాలకు ముందే కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఇలా చిన్నగా మారటం వలన చెట్లపై ఆవాసం ఏర్పరచుకోవడానికి, ఆహార సేకరణకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని బెంటన్‌ అధ్యయనంలో తేలింది.