న్యూఢిల్లీ : లోక్‌సభలో బిఎస్‌పి ఎంపి డానిష్ అలీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి రమేష్ బిధూరి సోమవారం ఆ పార్టీ అధ్యక్షులు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అలీపై ఉపయోగించిన పదాలపై బిధూరిని నడ్డా వివరణ కోరినట్లు తెలిసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈ నెల 21న చంద్రయాన్-3పై చర్చ జరుగుతున్న సమయంలో అలీపై బిధూరి అవమానకరమైన వ్యాఖ్యలు, మతదూషణలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో బిధూరిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టుతున్నాయి.. బిధూరి వ్యాఖ్యలను లెఫ్ట్ పార్టీలు ఖండించాయి. స్పీకర్ ఓం బిర్లాకు అలీ స్వయంగా లేఖ కూడా రాసారు. అయినా స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బిజెపి కూడా ఈ అంశంపై బిధూరికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జెపి నడ్డాను బిధూరి కలుసుకున్నారు. అయితే ఈ సమావేశంలో ఏమి జరిగిందనేదానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు బిధూరికి మద్దతుగా నిషికాంత్ దూబే, సుధాన్షు త్రివేది వంటి బిజెపి ఎంపీలు రంగంలోకి దిగారు. అలీనే ముందుగా బిధూరిని రెచ్చగొట్టాడని, హిందుమతం, ప్రధాని మోడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తున్నారు.










