అసని.. బిపార్జోయ్.. మోచా.. తుపాన్‌ల పేర్లు తరచూ వినబడుతున్నాయి. తీరా ఏమిటని చూస్తే 'తీరం దాటింది.. లేదా తీవ్ర రూపం దాలుస్తుంది..!' అన్న ప్రకటనలు.. తుపాన్‌లను గురించి చిన్నప్పటి నుంచి వింటున్నాం.. చూస్తున్నాం.. కానీ అసలు తుపాన్‌లకు పేర్లేంటి? ఎందుకిలా పెడతారు? అసలెవరు పెడతారు? దీనివలన ఉపయోగమేమిటి అనేది తెలుసా? అదే తెలుసుకుందాం.. ఇప్పుడు. విశ్వంలోని ప్రతిదీ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, భాస్వరం, సల్ఫర్ .. ఇలా మూలకాల అణువులతో నిర్మించబడ్డవే. ఈ అణువులు ఎప్పుడూ చలిస్తూనే ఉంటాయి. అవి ఒకదానికొకటి కలసినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు ఉష్ణం పుడుతుంది. సముద్రంలో నీరు వెచ్చగా ఉన్న ప్రాంతాల్లోకి గాలులు వీచినప్పుడు తుపాన్ ఏర్పడుతుంది. ఈ గాలులు తేమను సేకరించి పైకి లేవటం, చల్లటి గాలి దిగువన కదలటంతో ఒత్తిడి సృష్టించబడుతుంది. దీని వలన గాలులు చాలా వేగంగా కదులుతాయి. అలా తుపాన్ ఏర్పడుతుంది.
ప్రపంచంలో మొట్టమొదట ఏర్పడిన తుపాను (సైక్లోన్) పేరు కెసినీ. ఇది నైరుతి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుపాను. తుపానుల్లోనూ నాలుగు రకాలున్నాయి. అవి: ఉష్ణమండల తుపాను, పోలార్ సైక్లోన్, మెసోసైక్లోన్, ఎక్స్ట్రాట్రాపికల్ సైక్లోన్. అసలు సైక్లోన్ అనే పదాన్ని హెన్రీ పిడింగ్టన్ ఉపయోగించారు. అంటే పాముచుట్ట అని అర్థం.
- పేరు.. ఎలా..? ఎందుకు..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సముద్ర పరీవాహక ప్రాంతంలో ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, ఉష్ణమండల తుపాను హెచ్చరిక కేంద్రాలు ఉంటాయి. తుపాను తీవ్రత, ఇతర వివరాలను తెలిపేందుకు ఆ కేంద్రాలలోనే పేరు పెడతారు. సాధారణంగా ఆయా ప్రాంతాలలో ప్రజలకు తెలిసిన పేర్లనే ఎంపిక చేస్తారు.
వారు సులభంగా అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఈ పేర్లు తోడ్పడతాయి. ప్రజల అవగాహనను పెంచుతాయి. ఒకే సమయంలో అనేక తుపానులు సంభవించినట్లయితే గందరగోళాన్ని తగ్గిస్తాయి. విపత్తు తీవ్రత అవగాహనకు, సంసిద్ధతకు సులభతరం అవుతుంది. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన (డబ్ల్యుఎమ్‌ఓ) ప్రపంచ వాతావరణ సంస్థ సభ్యుల ఆమోదంతోనే ఈ ప్రక్రియ జరుగుతుంది.
- ప్రపంచంలో అతిపెద్ద తుపాను..
1975 జూన్‌లో వచ్చిన సూపర్ టైఫూన్ కంటే అక్టోబర్ 12, 1979న వచ్చిన సూపర్ టైఫూన్ టిప్ పెద్దదిగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక తుపానులకు నిలయం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అట్లాంటిక్ మహాసముద్రం లేదా గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుండి ఉద్భవించే తుపానుల కారణంగా యునైటెడ్ స్టేట్స్‌ను తాకిన 292 హరికేన్‌ల మూలంగా 41 శాతం పైగా ఫ్లోరిడా దెబ్బతింది.
- మనదేశంలో..
మన దేశ చరిత్రలో ఏడు ప్రాణాంతకమైన తుపానులు వచ్చాయి. అవి 1970లో భోలా తుపాను, 1737..హుగ్లీ రివర్ సైక్లోన్, 1839.. కోరింగా తుపాను, 1864.. కలకత్తా తుపాను, 1833.. బెంగాల్ తుపాను, 1942..బెంగాల్ తుపాను, 1977..లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ తుపానులు భారీ నష్టాన్ని కలిగించాయి.
ఉష్ణమండల తుపానులకు ప్రాంతీయ స్థాయిలో నియమాల ప్రకారం పేరు పెట్టారు. అట్లాంటిక్, దక్షిణ అర్ధగోళంలో (హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం) ఏర్పడిన ఉష్ణమండల తుపానులకు అక్షర క్రమంలో పేర్లు పెట్టారు. అగ్ని, ఆకాష్, బిజిలీ, జల్ 2004 నుండి సంభవించిన తుపానులు ఇవి. ఇంకా లెహర్, మేఫ్‌ు, సాగర్, వాయు. పాకిస్థాన్‌లో నీలోఫర్, తిత్లీ, బుల్బుల్ ఇలా తుపాన్‌ల పేర్లు ఉన్నాయి.

- చరిత్రలోనే.. అత్యంత భయంకరం..
గాల్వెస్టన్ హరికేన్ 1900వ సంవత్సరంలో వచ్చింది. తీవ్రమైన గాలులతో కూడిన ఈ తుపాను కారణంగా భారీ నష్టం జరిగింది. ఆ సమయంలో గాల్వెస్టన్‌లోని ఎత్తయిన ప్రదేశం సముద్ర మట్టానికి తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది. కేవలం నాలుగు సెకన్ల వ్యవధిలోనే దాదాపు నాలుగు అడుగుల మేర నీరు చేరినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. దీనిని గ్రేట్ గాల్వెస్టన్ హరికేన్, గాల్వెస్టన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు. 15 అడుగుల ఉప్పెన. ద్వీపం పూర్తిగా మునిగిపోయింది. ఈ తుపానుకు ప్రాంతీయంగా గ్రేట్ స్టార్మ్ ఆఫ్ 1900, 1900 స్టార్మ్ అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకతి వైపరీత్యం.
- విశ్వంలోనూ..
బృహస్పతి మీద వచ్చే తుపాను గ్రేట్ రెడ్ స్పాట్. ఇది సౌర వ్యవస్థలో అతిపెద్ద యాంటీసైక్లోనిక్ తుపాను. అధిక వాతావరణ పీడన కేంద్రం చుట్టూ తిరుగుతూ ఎరుపు, నారింజ రంగులో కనబడుతుంది. ఇది బహస్పతికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం. యాంటీసైక్లోన్ భూమి మీద వచ్చే తుపానులకు వ్యతిరేక దిశలో తిరుగుతుంది. గ్రేట్ రెడ్ స్పాట్‌పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.










