పోలీసు అమరవీరుల దినోత్సవంలో సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. .పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గన్నారు. శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. 'అమరులు వారు...' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అణగారిన ప్రజలు, ఆడపిల్లల భద్రత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ, డేటా దొంగతనం నుండి అనేక అంశాల్లో పోలీసులు అప్‌డేట్ కావాలని అన్నారు. హోంగార్డుల నుండి డిజి స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మారుతున్న సవాళ్లకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. అంశాల్లోనూ ఎపి పోలీసులు ముందున్నారని 130 మంది సాంకేతిక నిపుణులు ప్రజల కోసం పనిచేస్తున్నారన్న విషయం ఎంతో ధైర్యాన్నిస్తుందని పేర్కొన్నారు..
- అసాంఘిక శక్తులంటే...
ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజా జీవనాన్ని తమ స్వార్థం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ అసాంఘిక శక్తులేనని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ పదాన్ని పునర్ నిర్వచించాలని అన్నారు. ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలనుకునే శక్తులు అడవుల్లోనో, అజ్ఞాతంలోనో కాకుండా ప్రజా జీవితంలో కూడా ఉంటున్నాయన్నారు. ఇటీవల నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను చంపారని అన్నారు. అంగళ్లలో ప్రతిపక్షనాయకుడు తన పార్టీవాళ్లను రెచ్చగొట్టారని, ఈ ఘర్షణలో 40 మంది పోలీసులు గాయపడ్డారని, ఒకరికి కన్ను కూడా పోయిందని తెలిపారు. ఇవన్నీ కూడా యాంటి సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీదగానీ, రూల్ ఆఫ్ లా మీదా గానీ నమ్మకం ఉన్నవాళ్లు చేసే పనులు కాదని అన్నారు. స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న అటువంటి వారి పనిపట్టాలని సూచించారు.










