Nov 07,2023 08:23

ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
ప్రజాశక్తి - గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా):చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని కొట్రకోన పంచాయతీకి చెందిన గారంపల్లె వద్ద నీవా నదిలో కొంతమంది అక్రమార్కులు భారీ స్థాయిలో వాహనాలతో ఇసుక తరలింపు చేపట్టారు. ఎలాంటి అనుమతులూ లేనప్పటికీ అక్రమార్కులు గతంలోని నకిలీ బిల్లులతో ఇసుక అక్రమ అమ్మకాలు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న సర్పంచి భర్త విజరుశేఖర్‌, ఉప సర్పంచి కుమార్‌, ఎంపిటిసి భర్త సుధాకర్‌రెడ్డి రీచ్‌ వద్దకు చేరుకుని ఇసుక తరలింపునకు అనుమతులు ఉంటే చూపాలని పట్టుబట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ రామాంజనేయులకు ఫిర్యాదు చేయడంతో ఆయన సిబ్బందితో కలిసి రీచ్‌ వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వారినుంచి నకిలీ బిల్లులను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ప్రొక్లైనర్లు, ఒక మోటార్‌ సైకిల్‌, ఒక కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే ఘటనకు ప్రధాన కారకుడైన జ్ఞానేంద్రరెడ్డి అలియాస్‌ కలిజవేడు కిరణ్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.