Jun 25,2023 13:52

ఆహా ! ఆ వాల్‌ హాంగింగ్‌ ఫ్లవర్‌ వేజ్‌ భలే ఉందే.. అరె ! ఫ్రూట్‌ బాస్కెట్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద పెడితే ఎంత అందం వచ్చిందో.. ఈ మోడా చూడు ఎంత బాగుందో.. ఇలా వెదురుతో చేసిన ఎన్నెన్నో గృహోపకరణాలు మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. మరి ఇంత అందమైన ఆలోచన ఎవరిది..? అసలెక్కడ ఈ వెదురు వస్తోపకరణాలకు పునాది అని చూస్తే.. ఏడు వేల సంవత్సరాలకు పూర్వమే చైనాలో వెదురుతో చేసిన ఆయుధాలు, గృహోపకరణాలు వినియోగించేవారని పురాతత్వశాస్త్రం చెబుతోంది. మూడవ శతాబ్దం నాటికి దక్షిణ చైనాలో వెదురు గుజ్జుతో కాగితం తయారుచేయటం ప్రారంభమైంది. మరి ఈ అందాల వెదురు వెనుక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...

ఆహారంగానూ.. కొన్ని గిరిజన తెగలు వెదురు చిగుళ్ళను ఊరగాయ పెట్టుకొంటారు. గోధుమలను పోలి ఉండే వెదురు గింజలను దంచి, పైపొట్టు తీసి రొట్టెలు చేస్తారు. మరికొందరు వెదురు గింజలతో కల్లు, సారాయిలను తయారు చేస్తారు.

011

         వెదురు గడ్డి జాతికి చెందిన మొక్క. ఇది ఫోయేసి కుటుంబానికి చెందింది. నిచ్చెన నుంచి నిట్రాడు దాకా వాడే ఈ వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. బుద్ధాస్‌ బెల్లి బ్యాంబూ.. రెడ్‌ బ్యాంబూ.. గోల్డెన్‌ బ్యాంబూ డ్వార్ఫ్‌.. ఇండోర్‌ వెదురు.. గోల్డెన్‌ హవాయి వెదురు.. కణుపు వెదురు.. వెదురు బోన్సాయి. ఇవి కొన్ని మాత్రమే. ఒకేరకానికి చెందిన వెదురు ప్రపంచంలో ఏమూలనున్నా ఒకేసారి పూతకు వస్తుంది. వెదురు పూత ఒకేసారి వెన్ను విరిసి ధాన్యం దిగుతుంది. వీటిలో కొన్ని రకాల గురించి తెలుసుకుంటే..
          బుద్ధాస్‌ బెల్లి బ్యాంబూ కణుపుల వద్ద ఉబ్బినట్లుండి పొట్టిగా లాంతరు గ్లాసు ఆకారంలో ఉంటుంది. ఆకులు సన్నగా, కోలగా ఉంటాయి. కాండాలకు, కొమ్మలకు ఉండే కణుపులే ఈ మొక్కకి అందం. రెండు నుంచి ఐదడు గుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రధాన కాండం నుంచి రెండువైపులా సమాంతరంగా శీర్షాల్లాంటి ఉపకొమ్మలు ఉంటాయి. అవి కళాత్మకంగా ఉంటాయి.
          రెడ్‌ బ్యాంబూ అనే వెదురు ఒక్క ఆకులు మినహా కాండం, కాయలు అన్నీ ఎరుపు రంగులోనే ఉంటాయి. చూడటానికి భలే ఆకర్షణగా ఉంటుంది. ఫిలోస్టాకిస్‌ రుబ్రోమార్జినాటా దీని శాస్త్రీయనామం. ఇది పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. సన్నగా చేతికర్ర మాదిరిగా ఉంటుంది.
గోల్డెన్‌ బ్యాంబూ డ్వార్ఫ్‌ ఇండ్లలో పెంచుకోవ డానికి అనువైన, అందమైన వెదురు మొక్కలు ఇవి. కాండం పసుపుపచ్చని బంగారు రంగులో అందంగా ఉండడంతో పాటు లేతాకుపచ్చ ఆకులు మొక్క నిండుగా ఒత్తుగా పెరిగి అందంగా ఉంటుంది. ఇది చైనాకు చెందినది. సన్నగా పొడవుగా జూకల్లా ఎదిగేది ఇండోర్‌ బ్యాంబూ. వీటికి రెండు నుంచి మూడంగుళాల పొడవు ఉన్న పచ్చని ఆకులుంటాయి. గోల్డెన్‌ హవాయి వెదురు మొక్క పసుపు రంగు మీద ఆకు పచ్చని గీతల డిజైన్‌తో ఉండటం దీని ప్రత్యేకత. మొక్క పెరిగే కొద్దీ కణుపుల మీద ఉండే డిజైన్‌ మరింత తేజోవంతంగా మారుతుంది. బంబుసా వల్గారిస్‌ విట్టాట దీని శాస్త్రీయ నామం.

022


          వెదురు బోనసాయ్ కోసం.. ఏళ్ల తరబడి పెరిగిన వెదురు మొక్కలను జాగ్రత్తగా కూకటివేళ్లతో సేకరించి, పైభాగం కత్తిరించి వేరే కుండీల్లో పెట్టి పెంచుతారు. కత్తిరించిన భాగంలో నెమ్మదిగా మొలకలు తొడిగి, చిగురులు విచ్చుకొని సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. ఇలా పెంచడం వృక్ష ప్రేమికులకు ఒక కళలాంటిది.
 

                                                               అనేక రకాలుగా.. ఇళ్ళ నిరాణంలోనూ..

ప్రాచీన మానవుడు వేటకు ఉపయోగించిన బాణం-విల్లు వెదురుతో తయారుచేసినవే. క్రమేపీ పేపర్‌ తయారీతో.. నూతన పరికరాలు, గృహోపకరణాలు, అలంకరణ సామగ్రి తయారు చేయబడ్డాయి. ఇళ్ళ నిర్మాణంలో పైకప్పుకు వాసాలు, తడికలు, మరెన్నో రకాలుగా ఉపయోగించేవారు వెదురును. నేటికీ కొన్నిచోట్ల పల్లెల్లో వెదురుతో నిర్మించిన ఇళ్ళు కనబడుతుంటాయి. నిచ్చెనలు, బల్లలు, బుట్టలు, చేటలులాంటి గృహ సామగ్రి, అనేకరకాల అలంకరణ వస్తువుల తయారీలోనూ ఈ వెదురు ప్రాధాన్యత సంతరించుకుంది.

033


                                                                                   విచిత్రం...

  • బంబూసా అరుండానేషియా అనే రకం వెదురుకు 50 నుంచి 60 సంవత్సరాలలో ఒక్కసారే పూత వస్తుంది. ఈ వెదురు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అడవులలో విస్తారంగా పెరుగుతుంది. 1935 నుండి 1938 మధ్య పూసిన ఈ వెదురు మళ్ళీ ఇప్పుడు పూస్తున్నది. ఈ విత్తనాలను శాస్త్రజ్ఞులు సేకరించి జాగ్రత్త పరచారు.
  • గడ్డి జాతికి చెందిన కొన్ని రకాలు 90 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.
  • మొలాకా అనే వెదురు 24 గంటల కాలంలో రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది.
  • ఫిలిప్పీన్స్‌లో, నిపా హట్‌ పూర్తిగా వెదురును ఉపయోగించే నిర్మించారు.
  • వియత్నాం, బాలి (ఇండోనేషియా), చైనా, కొలంబియాలో ఈ రోజు వరకు, అత్యంత ఉన్నతమైన ప్రాజెక్ట్‌ నిర్మాణాలకు వెదురునే ఉపయోగిస్తారు.
  • షాంఘైలోని ఇండియా పెవిలియన్‌, ప్రపంచంలోనే అతి పెద్ద వెదురు గోపురం. ఇది దాదాపు 34 మీ (112 అడుగులు) వ్యాసం కలిగి ఉంది.
  • ఇంటర్నేషనల్‌ బాంబూ అండ్‌ రట్టన్‌ ఆర్గనైజేషన్‌, హాంకాంగ్‌లో అసెంబ్లీ మెటీరియల్‌ అంతా వెదురు కట్టడాలే.

                                                                           వైద్యంలో వెదురు..

ఆయుర్వేదంలో వెదురుది పూర్వకాలం నుంచీ పెద్దపీటే. ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్‌ అంటారు. తబషిర్‌, తవషిర్‌ అని.. యునానీ వైద్య విధానంలో పిలుస్తారు. ఆంగ్లంలో బాంబూ మన్నా అని వ్యవహరిస్తారు. ఊపిరితిత్తులవ్యాధికి టానిక్‌గా ఉపయోగిస్తారు. దీని లేత చిగుళ్ళతో తయారుచేసిన కషాయం శరీరానికి చలువ చేస్తుంది. ముఖ్యంగా మధుమేహం, కఫం, మూలవ్యాధి నివారణకు, రక్త శుద్ధికి దీని ప్రాధాన్యం ఎంతో ఉంది. మహిళలకు గర్భ కోశం Ûశుద్ధి చేసి ఎలాంటి వ్యాధులు రాకుండా అరికడుతుంది. అంటువ్యాధులను నిర్మూలించే శక్తి ఉంది. దీనిలో ప్రొటీనులు ఉంటాయి. పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది.

                                                                   వాద్య పరికరాల తయారీలో..

వెదురుతో గృహోపకరణాలే కాక సంగీత వాద్య పరికరాలూ తయారు చేస్తున్నారు. సప్తస్వరాలు పలికించే వేణువు, ఫిడేలు, ఏక్తారా వంటి అనేక వాద్య పరికరాలను ఈ వెదురుతోనే తయారు చేస్తారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది వేణువు. ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో వారి మ్యూజిక్‌కి అనుగుణంగా అనేక రకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌ వెలుగొందుతున్నాయి. డిజి, క్సియో, కరువాచి, పలెన్‌డగ్‌, జింగు, యాంక్లంగ్‌.. ఇవన్నీ వెదురుతో తయారైనవే.

                                                                     అలంకరణ సామాగ్రిగా..

వెదురుతో చేసిన లాంతర్లు, చేతి బ్యాగులు, ఫోటో ఫ్రేములు, పూల సజ్జలు, వాల్‌ హేంగర్లు మొదలైనవే కాక, పుస్తకాల రేకలు, బట్టల బుట్టలు, వెదురు కుర్చీలు, ఉయ్యాల బల్లలు, ఫెన్సింగులు ఇలా ఇంటికి శోభనిచ్చేవి ఎన్నో. వ్యాపారపరంగానూ వీటికి మంచి డిమాండ్‌ ఉంది. జపనీయులు, చైనీయులు వెదురుతో చేసిన గృహాలకు, వస్తువులకు మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఇక ఒక్క మాటలో వెదురు ప్రాశస్త్యం చెప్పాలంటే, పుట్టినప్పుడు ఉయ్యాల దగ్గరనుంచి, మరణానంతరం ఏడు కట్ల సవారీగా మనిషి జీవిత కాలం అంతా మనతోనే ఉంటుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506