ప్రజాశక్తి- ఎడ్యుకేషన్ (విజయవాడ):విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు డిసెంబరు 12, 13, 14 తేదీల్లో అమరావతి బాలోత్సవం పిల్లల పండుగ నిర్వహించనున్నట్లు అమరావతి బాలోత్సవం అధ్యక్షులు ఎస్.పి.రామరాజు తెలిపారు. బాలోత్సవ్ 6వ పిల్లల పండుగకు సంబంధించిన పోస్టర్‌ను విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. 2017 నుండి ఐదేళ్లుగా అమరావతి బాలోత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరవ పిల్లల పండుగను మొగల్‌రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ బాలోత్సవ్‌కు 'దేశభక్తి' థీమ్‌ను నిర్ణయించామని, 39 ఎకడమిక్ ఈవెంట్స్, 16 కల్చరల్ ఈవెంట్స్ కలిపి 55 ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్, ప్రతి స్కూలుకు జ్ఞాపిక బహూకరించనున్నామని పేర్కొన్నారు. విజయవాడ నగరంతోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న ఎన్‌టిఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాలోని విద్యార్థులు పాల్గనవచ్చని తెలిపారు. పోటీల్లో పాల్గనే పాఠశాలలు ఎంట్రీలు డిసెంబరు 8వ తేదీలోగా పంపాలన్నారు. బాలోత్సవంలో మున్సిపల్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కార్పొరేట్, మిషనరీ పాఠశాలల విద్యార్థులంతా పాల్గనవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బాలోత్సవ్ ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు, సభ్యులు వి.సాంబిరెడ్డి, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పలువురు పాల్గొన్నారు.










