Nov 01,2023 08:25
  • వైద్యం కోసం 4 వారాలకు షరతులతో అనుమతి
  • జైలు నుండి విడుదల
  • కార్యకర్తల ఘన స్వాగతం
  • రాజమహేంద్రవరం నుండి అమరావతికి రోడ్డుమార్గంలో ప్రయాణం
  • మద్యంకేసులో 28 వరకు అరెస్ట్‌ చేయం : సిఐడి

ప్రజాశక్తి-యంత్రాంగం : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. దీంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుండి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. 52 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులు లోకేష్‌, బ్రహ్మణీ, బాలకృష్ణలతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యకర్తల నుద్దేశించి కొద్దిసేపు మాట్లాడిన అనంతరం చంద్రబాబు రాజమహేంద్రవరం నుండి అమరావతికి రోడ్డుమార్గంలో ప్రయాణమైనారు. అంతకుముందు చంద్రబాబు అనారోగ్య పరిస్థితులను దష్టిలో పెట్టుకుని మద్యంతర బెయిల్‌ను షరతులతో మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్వర్వుల్లో ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌ 27వ తేది వరకు బెయిల్‌ అమలులో ఉంటుందని, 28వ తేది లొంగిపోవాలని పేర్కొన్నారు. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై 10వ తేదీన విచారణ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆయన వెంట ఇద్దరు సిఐడి డిఎస్‌పిలు ఉండేందుకు అనుమతించాలంటూ సిఐడి చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బెయిల్‌ గడువు ముగిసే 28 వ తేది వరకు మద్యం కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయబోమని ధర్మాసనానికి సిఐడి తెలిపింది.
 

                                                                             షరతులివి...

బెయిల్‌ ఉత్తర్వుల్లో ఐదు షరతులను పేర్కొన్న ధర్మాసనం, సిఐడి దాఖలు చేసిన మెమోను పరిశీలించిన అనంతరం మరికొన్ని షరతులను చేర్చింది. తొలుత పేర్కొన్న షరతుల ప్రకారం కేసు విచారణ చేస్తున్న విజయవాడ ఎసిబి కోర్టులో లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలి. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చు. సరెండర్‌ అయ్యే సమయంలో చికిత్సతో పాటు ఆస్పత్రి వివరాలను
జైలు సూపరింటెడెంట్‌కు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలి. ఆ కవర్‌ను జైలు సూపరింటెండెంట్‌ ఏసీబీ కోర్టుకు నివేదించాలి. పిటిషనర్‌ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసు విచారణను ప్రభావితం చేసే ఎటువంటి పనులను చేయకూడదు. నవంబర్‌ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎదుట లొంగిపోవాలని 16 పేజీల ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. మరికొన్ని షరతులు చేర్చాలంటూ మిగతా 2లో సిఐడి మెమో దాఖలు చేయడంతో ఉత్తర్వుల జారీ అనంతరం సిఐడి మెమో దాఖలు చేయడంతో మెమోపై విచారణ బుధవారం చేపడతామని, అప్పటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదని, ర్యాలీల్లో పాల్గ్నొకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని పేర్కొంటూ విడిగా మరో ఆదేశాలను జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు విడుదల కాగానే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టిడిపి పొలిట్‌బూ చెరో లక్ష రూపాయల పూచీకత్తును ఎసిబి కోర్టుకు సమర్పించారు.
 

                                                         క్షణం ఒక యుగంలా గడిచింది : నారా భువనేశ్వరి

చంద్రబాబు అరెస్టుతో 53 రోజులు ఎంతో వేదన, తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా నడిచిందని ఆయన భార్య నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఆయన విడుదల కాగానే ఉద్వేగానికి గురైన ఆమె సామాజిక మాధ్యమాల్లో తన స్పందన తెలియజేశారు. కష్ట సమయంలో తెలుగుజాతి నుంచి వచ్చిన మద్దతు ఎంతో ఊరటినిచ్చిందని, ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మరింత స్ఫూర్తినిచ్చాయని భువనేశ్వరి తెలిపారు. 'నిజం గెలవాలి' పేరిట తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె పేర్కొన్నారు. 'నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడ బస చేసిన నన్ను మీ ఇంటికి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మరిచి పోలేను' అంటూ తెలిపారు.
 

                                                           ప్రజా సేవకు పునరంకితం కావాలి : పవన్‌కల్యాణ్‌

చంద్రబాబుకు హైకోర్టులో మధ్యంతర బెయిల్‌ రావడం సంతోషకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని తాను ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆయన రాక కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
 

                                                                'బాబు'కు బెయిల్‌ సంతోషం : పురంధేశ్వరి

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ రావడం సంతోషకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయానికి మంగళవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బాబు కేసు విషయాన్ని తప్పు బట్టడం లేదని, అరెస్టు చేసిన విధానాన్ని మొదటినుంచి ఖండిస్తూనే ఉన్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మద్యం పరిశ్రమలను ప్రస్తుత అధికార పార్టీ వారు సబ్‌లీజ్‌ తీసుకుని నాసిరకంగా మందు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
 

                                                        కండీషన్‌ బెయిల్‌కు సంబరాలు సిగ్గుచేటు : సజ్జల

అవినీతి, అక్రమాల కేసులో అరెస్టు అయి అనారోగ్య సమస్యలతో కండీషన్‌ బెయిల్‌పై చంద్రబాబు బయటకు వస్తే టిడిపి నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కండీషన్‌ బెయిల్‌ మాత్రమే ఇచ్చారని, నాలుగు వారాల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వుంటుందనే అంశాన్ని టిడిపి తెలుసుకోవాలన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంటు స్కామ్‌లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని, పెండ్యాల శ్రీనివాస్‌ను విచారిస్తే అన్ని విషయాలూ బయటకు వస్తాయని అన్నారు. మధ్యంతర బెయిల్‌ రాగానే నిజం గెలిచినట్టా? అని సజ్జల ప్రశ్నించారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదన్నారు.

                                                                      ఆరోగ్య సమస్యల కారణంగానే...

ఆరోగ్య సమస్యల కారణంగానే చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిఐడి చేసిన వాదనలను ఆయన తోసిపుచ్చారు. 'గత జూన్‌ 21 నుంచి ఆరు నెలల్లోగా కుడి కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలని చంద్ర బాబు వైద్యులు సిఫార్సు చేశారు.
              ఆపరేషన్‌ కోసమే బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకున్నాం, వద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు సహజం. దీనికి మెడికల్‌ బోర్డు ఎదుట హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సిఐడి చేసిన వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఇదే సమయంలో స్కిల్‌ కేసులో సిఐడి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యం బెయిల్‌కు అడ్డంకికాదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పే వరకు బెయిల్‌ పిటిషన్‌ను విచారించవద్దని సిఐడి వాదించడం సబబు కాదు. నిందితులపై నేరారోపణల తీవ్రత కంటే వాళ్ల ఆరోగ్యం ముఖ్యం. దర్యాప్తులో భాగంగా జ్యుడిషియల్‌ కస్టడీలో మాత్రమే బాబు ఉన్నారు. పిటిషనర్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు బెయిల్‌ మంజూరుకు యోగ్యులు. బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకునే ఆస్కారం ఏమాత్రం లేదు. సీఎంగా చేశారు. విపక్ష నేతగా ఉన్నారు, ప్రజలతో గట్టి సంబంధాలు ఉన్న వ్యక్తి . దేశం విడిచి పారిపోతారనేందుకు అస్కారమే లేదు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే 4 వారాలపాటు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం.' అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

                                                                                 మద్యం కేసులో....

మద్యం కేసులో నిందితుడిగా ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును నవంబరు 28 వరకు అరెస్టు చేయబోమని హైకోర్టుకు సిఐడి హామీ ఇచ్చింది. చంద్రబాబును మూడో నిందితుడిగా చేర్చుతూ సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
         చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తూ స్కిల్‌ కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే మద్యం కేసులో అరెస్టు చేయాలనే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ వాదనను సిఐడి తరఫున ఎజి తోసిపుచ్చారు. దీంతో విచారణను నవంబరు 21కి హైకోర్టు వాయిదా వేసింది. మీ అభిమానాన్ని మరిచిపోలేను : చంద్రబాబు '52 రోజులుగా నాకోసం మీరు రోడ్లమీదకు వచ్చారు. ఆందోళనలు చేయడమే కాకుండా నేను చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా స్పందించారు. నా జీవితం ధన్యమైంది. ఇటువంటి అనుభూతి ఏ రాజకీయ నాయకుడికి రాదు.

                                                           మీ అభిమానాన్ని మరచిపోలేను' : చంద్రబాబు

మీ అభిమానాన్ని మరచిపోలేను' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బెయిల్‌పై జెయిల్‌ నుండి బయటకు వచ్చిన తరువాత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు,. ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పూ చేయలేదని, తప్పులను కూడా చేయనివ్వనని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్‌ యాత్ర చేసి అభిమానం చాటారన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం తనకు మద్దతు తెలపడాన్ని మరువలేనని చెప్పారు. సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలకూ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి అమరావతికి బయలుదేరారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు కెఎస్‌ జవహర్‌, పీతల సుజాత, టిడిపి రాష్ట్ర నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాం, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్‌ తదితరులు ఉన్నారు. బెయిల్‌ మంజూరు కావడంతో ఉదయం నుంచే టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నగరంలోని లోకేష్‌ క్యాంపు కార్యాలయంతోపాటు జిల్లాలో పలుచోట్ల బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు.. సెంట్రల్‌ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సెంట్రల్‌ జైలుకు తరలి వచ్చిన టిడిపి శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలను దాటుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు. టిడిపి జెండాలు చేతబూని చంద్రబాబుకు జేజేలు పలికారు.