Sep 27,2023 22:35

సుప్రీంకోర్టులో 3వ తేదికి
ఎసిబి కోర్టులో 4వ తేదికి
విచారణ నుండి తప్పుకున్న జస్టిస్‌ ఎస్‌విఎన్‌భట్టి
ప్రజాశక్తి - న్యూఢిల్లీ, అమరావతి :స్కిల్‌ స్కామ్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టు,ఎసిబి కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లు వాయిదా పడ్డాయి. స్క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) అక్టోబర్‌ 3వ తేదికి వాయిదా పడింది. ఎసిబి కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ 4వ తేదికి వాయిదా వేశారు. . దీంతో పాటు సిఐడి దాఖలు చేసిన రిమాండ్‌ పిటిషన్‌నుకూడా ఎసిబి కోర్టు అక్టోబర్‌ 4వ తేదికి వాయిదా వేసింది. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి జస్టిస్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి (సరస వెంకట నారాయణ భట్టి)ల బెంచి ముందు విచారణకు వచ్చింది. అయితే, కేసు విచారణకు తీసుకోక ముందే తాను 2013 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశానని, అందవల్ల విచారణ నుండి తప్పుకుంటున్నట్లు జిస్టిస్‌ ఎస్‌విఎస్‌ భట్టి ప్రకటించారు. దీంతో కేసు విచారణపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, హరీష్‌ సాల్వేలు సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని, వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదన్నారు. జస్టిస్‌ ఖన్నా అనుమతితో లూథ్రా ఎస్‌ఎల్‌పి విషయాన్ని మరోసారి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ముందు ప్రస్తావించారు. జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి విచారణ నుండి తప్పుకున్న విషయం చెబుతూ ఎస్‌ఎల్‌పిపై తక్షణమే విచారణ జరపాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్‌ కావాలంటే బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించగా దానికి లూథ్రా తిరస్కరించారు. ' మేం బెయిల్‌ అడగడం లేదు. సాధ్యమైనంత త్వరగా కేసును లిస్ట్‌ చేయాలని కోరుతున్నాం, 17 ఎ సెక్షన్‌ ప్రకారం చంద్రబాబును అరెస్ట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతి తీసుకోవాలి. అలా జరగలేదు. అలా చేయలేదు. జడ్‌ కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. సిఐడి కస్టడికి అడుగుతోంది. దాని నుండి మినహాయిస్తూఆదేశాలు ఇవ్వండి' అని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ తిరస్కరించారు. ఈ దశలో అటువంటి ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ అక్టోబర్‌ 3వ తేదికి విచారణను వాయిదా వేశారు.
ఎసిబి కోర్టులో....
సిఐడి వేసిన కస్టడి పిటిషన్‌, చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లు ఎసిబి కోర్టులో బుధవారం విచారణకు వచ్చాయి. చంద్రబాబును తమ కస్టడికి ఇస్తే విచారణను పూర్తి చేస్తామని సిఐడి తరపు న్యాయవాదులు కోరారు. వారు వాదనలను కొనసాగిస్తుండటంతో విచారణను 5వ తేదికి వాయిదా వేయాలనుకుంటున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. దీనికి తమ వాదనలు పూర్తి చేయాలని సిఐడి తరపు న్యాయవాదులు కోరారు. విచారణను ప్రస్తుతానికి వాయిదా వేయాలని, శుక్రవారం తమ వాదనలు వినిపిస్తామని బాబు తరపు న్యాయవాదులు చెప్పడంతో న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్త ం చేశారు. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసి 17 రోజులైనా ఎందుకు వాదనలు వినిపించడం లేదని ప్రశ్నించారు. కోర్టు సమయాన్ని వృద్ధా చేయవద్దన్నారు. అనంతరం కస్టడి, బెయిల్‌ పిటిషన్లు రెండింటిని 4వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు అమరావతి రింగ్‌రోడ్‌, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో పిటి వారెంట్ల విచారణను కూడా ఎసిబి కోర్టు 4వ తేదికి వాయిదా వేసింది.