- సింధు ర్యాంక్ మెరుగు
లాసన్నె: ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్‌ఎస్ ప్రణరు టాప్-10లో నిలిచాడు. బిడబ్ల్యుఎఫ్ మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్‌ఎస్ ప్రణరు, లక్ష్యసేన్ ఇద్దరూ వరుసగా 9, 11వ ర్యాంకులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరిన యువ సంచలనం ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకాడు. 28వ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన సింధు రెండు స్థానాలు ఎగబాకడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరడంతో ఆమె ర్యాంకు మెరుగుపడింది. ఇక కిదాంబి శ్రీకాంత్ 19వ స్థానం నుంచి 20వ ర్యాంకుకు పడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 2వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో త్రీష జాలీ-గాయత్రి గోపిచంద్ రెండు స్థానాలు కోల్పోయి, 19వ ర్యాంక్‌లో నిలిచారు.











