Oct 29,2023 16:32

సంగారెడ్డి: పేదలను ఆదుకోవడంలో బిఆర్‌ఎస్‌ విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పిందని, వాటి ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చిందని, ఇప్పుడు కూడా 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి పాల్గొన్నారు.