- ఏడుగురు ఎంపిలతో సహా 41 మంది అభ్యర్థులు
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం 41 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఒక రాజ్యసభ సభ్యుడితో సహా ఏడుగురు ఎంపిలు ఉన్నారు. సోమవారం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన కొన్ని గంటల్లోనే బిజెపి ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె మద్దతుదారులెవరికీ స్థానం లేకపోవడం విశేషం. జాబితా ప్రకారం విధ్యాధర్ నగర్ నుంచి ఎంపి దియా కుమారి, జోత్వారా నుంచి ఎంపి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు ఎంపిలు బాలాకాంత్, భగీరథ్ చౌదరి, నరేంద్ర కుమార్, జలోరేసిరోహి, దేవ్‌జి పటేల్, రాజ్యసభ ఎంపి కిరోదిలాల్ మీనాను బిజెపి బరిలోకి దింపింది. మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమోహన్ మీనా జైపూర్ జిల్లా బస్సి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.










