Oct 29,2023 16:07

హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్‌ ప్రచారాన్ని సోషల్‌ మీడియా ద్వారానే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు.విద్యార్థులంతా అభివఅద్ధి పనుల దగ్గర సెల్ఫీలు దిగి ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. 33 మెడికల్‌ కాలేజీల దగ్గర సెల్ఫీలు దిగి డీపీలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో 1,001 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. గురుకుల విద్యార్థులతో రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి దగ్గర నల్లా పక్కన నిలబడి సెల్ఫీలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నర్సీరీ ఉన్న ఏకైక రాష్ట్రం మనదని మంత్రి చెప్పారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర నిలబడి ఫొటోలు దిగి ప్రచారం చేయాలని కోరారు.