Oct 08,2023 09:39
  • నితీశ్‌ ప్రభుతం లక్ష్యంగా ఆరోపణలు

పాట్నా : ఇటీవల విడుదలైన బీహార్‌ కులాల సర్వే నివేదికలో గుర్తించబడిన వెనుకబడిన తరగతులలో 10 శాతం మంది మైనారిటీ వర్గానికి చెందినవారు ఉన్నారు. కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ముంగేరి లాల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేసి ఈబీసీలకు ప్రత్యేక కోటాను ప్రవేశపెట్టినప్పటింది. అప్పటి నుంచి కొన్ని ముస్లిం సమూహాలు ఇబిసి (ఓబీసీలలో అత్యంత వెనుకబడిన తరగతి వర్గం)గా గుర్తించబడ్డాయి. తాజాగా బీహార్‌లో చేపట్టిన కుల గణనపై బిజెపి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలను టార్గెట్‌ చేస్తూ నితీశ్‌ సర్కారుపై ఆరోపణలు గుప్పిస్తున్నది. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఈబీసీల సంఖ్యలను జనాభాలో 36 శాతానికి తీసుకువెళ్లిందని కాషాయ పార్టీ ఆరోపిస్తున్నది. జేడీ(యూ) మాజీ రాజ్యసభ ఎంపీ, ఆలిండియా పస్మండ ముస్లిం అధిపతి మహజ్‌ అలీ అన్వర్‌ అన్సారీ మాట్లాడుతూ.. కొత్త ఈబీసీ గణాంకాలను బట్టి చూస్తే గణనీయంగా వెనుకబడిన ముస్లింలు ఉన్నారని చూపుతున్నాయన్నారు. ఈబీసీలు నితీష్‌ ద్వారా రాజకీయంగా పోషించబడిన వర్గంమనీ, అతని స్వంత సామాజికవర్గం కుర్మీలు రాష్ట్రంలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ''బీహార్‌ కులాల సర్వే మేము ఇంతకాలం చెబుతున్నదానిని రుజువు చేసింది. 1931 జనాభా లెక్కల వరకు ముస్లింలను కులాల వారీగా లెక్కించినప్పటికీ, మండల్‌ కమిషన్‌ నివేదికలో పేర్కొన్నప్పటికీ, ముస్లింలను ఒక కూటమిగా చూపుతూ రాజకీయాలు ఆడుతున్నారు. కులం హిందువులలో ఎంత వాస్తవమో ముస్లింలలో కూడా అంతే వాస్తవం'' అని అన్సారీ అన్నారు. రాష్ట్రంలో రెండు ముస్లిం గ్రూపులు నల్‌బండ్‌లు, మాలిక్‌లు ఓబీసీలుగా గుర్తించబడగా, 24 ఈబీసీల కింద జాబితా చేయబడ్డాయి. మొత్తంగా, ముస్లిం ఓబీసీ సమూహాలు జనాభాలో 10 శాతానికి పైగా ఉన్నాయి. కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈబీసీలకు 12 శాతం, ఓబీసీలకు 8 శాతం, సాధారణ కేటగిరీలోని మహిళలు, వెనుకబడిన వారికి మూడు శాతం కోటాను పక్కన పెట్టింది. అన్సారీ చెప్పినట్టుగా రాష్ట్రంలో ముస్లింలను ఒక మతపరమైన కూటమిగా కాకుండా వారి ఆర్థిక స్థితి పరంగా చూడడానికి సర్వే దారి తీస్తుంది. బీహార్‌ సీఎం నితీష్‌ పస్మాండ ముస్లింలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.