- కోవిడ్ కట్టడి భేష్ అంటూ ఊదరగొడుతున్న కల్పిత కథనాలు
- బిజెపి లెక్కలు తప్పని చెప్తున్న డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాలు, రికవరీ రేటుపై వాస్తవాలను కప్పిపుచ్చుతూ, తప్పుడు గణాంకాలతో జనాలను నమ్మించే చర్యకు అధికార బిజెపి పూనుకున్నది. ఇందుకు ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలతో పాటు బిజెపికి అనుకూలంగా పని చేసే వార్త సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లతో ఇలాంటి ప్రచారాలకు తెరలేపుతున్నది. తాజాగా బీజేపీ 'ఎక్స్'లో ఓ వీడియోను షేర్ చేసింది. ఒకప్పుడు భారతదేశం అట్టడుగున ఉన్నదనీ, నేడు ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపుతున్నదని అందులో ఉన్నది. బీజేపీ, ప్రధాని మోడీ, ఇతర మంత్రులు, బీజేపీకి చెందిన మొత్తం ప్రచార యంత్రాంగం కోవిడ్ నిర్వహణకు సంబంధించి నిరంతరం వాదనలు వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు ఈ తరహా ప్రచారం మరింత ఉధృతంగా మారింది.
''రియల్ స్టోరీ'' పేరుతో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో హౌస్ట్ రిచా అనిరుధ్ బిజెపి ప్రభుత్వ కోవిడ్ నిర్వహణను ప్రశంసించారు. చాలా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారతదేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య చాలా తక్కువని తెలిపారు. ఇప్పుడు ఈ వాదన నిజమేనా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్‌లో నిజంగా కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయా? అన్నవి చర్చకు దారి తీస్తున్నది.
కోవిడ్ మరణాల్లో భారత్‌ది మూడో స్థానం
డబ్ల్యూహెచ్‌ఓ సమాచారం ప్రకారం.. గత మూడేండ్లలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 76,98,06,130 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా 69,55,497 మంది కోవిడ్ కారణంగా మరణించారు. కోవిడ్ మరణాల కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉండటం గమనించాల్సిన అంశం. భారత్‌లో కోవిడ్ కారణంగా 5,31,925 మంది మరణించారు. కోవిడ్ మరణాల కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి. కోవిడ్ వల్ల అమెరికాలో 11,27,152 మంది, బ్రెజిల్‌లో 7,04,659 మంది మరణించారు.
కేసుల పరంగానూ భారత్‌ది మూడో స్థానం
మొత్తం కోవిడ్ కేసుల పరంగానూ భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 76,98,06,130 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా అంటే 10,34,36,829 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న భారత్‌లో 4,49,96,599 కోవిడ్ కేసులు నమోదు కావటం గమనార్హం.
'ఆ దేశాల' కంటే భారత్‌లోనే ఎక్కువ మరణాలు
డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం.. కోవిడ్ మరణాల సంఖ్యలో ప్రపంచంలోని 195 దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లో కోవిడ్ కారణంగా చాలా తక్కువ మరణాలు సంభవించాయని బీజేపీ వాదిస్తున్నది. అయితే, వివిధ దేశాల గణాంకాలు మాత్రం ఈ వాదన తప్పని రుజువు చేస్తున్నాయి.
జపాన్, జర్మనీ, కెనడా, ఇంగ్లాండ్, అమెరికా, చైనా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలలో కంటే కోవిడ్ మరణాల సంఖ్య భారత్‌లోనే ఎక్కువ (అమెరికాను మినహాయిస్తే). ఈ సంఖ్య ఈ దేశాలలో భారత్ కంటే ఐదు నుంచి పది రెట్లు తక్కువగా ఉండటం గమనార్హం. భారత్‌లో కోవిడ్‌తో 5,31,925 మంది మరణించారు. జపాన్‌లో 74,694, కెనడాలో 53,147, డెన్మార్క్‌లో 8780, జర్మనీలో 1,74,979, ఇంగ్లండ్‌లో 2,28,707, చైనాలో 1,21,628, ఆస్ట్రేలియాలో 22,696, నెదర్లాండ్స్‌లో 22,986, ఫ్రాన్స్‌లో 1,67,985, ఇటలీలో 1,91,167 కరోనా మరణాలు సంభవించాయి.
ఇటు భారత్ కంటే చిన్న దేశాలతో పోలిస్తే కూడా కరోనా మరణాలు బీజేపీ చేస్తున్న వాదనలు తప్పని నిరూపిస్తున్నాయి. పొరుగు దేశాలలో కూడా భారత్‌లో కంటే కోవిడ్ సమయంలో చాలా రెట్లు తక్కువ మంది మరణించారు. కోవిడ్ కారణంగా పాకిస్తాన్‌లో 30,656 మంది, శ్రీలంకలో 16,882 మంది, బంగ్లాదేశ్‌లో 29,476 మంది, నేపాల్‌లో 12,031 మంది మరణించారు.
కోవిడ్ మరణాల గణాంకాలలో అస్పష్టత
భారత్‌లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువ అని డబ్ల్యూహెచ్‌ఓ ఒక సందర్భంలో తన నివేదికలలో పేర్కొన్నదని నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేశారు. భారత్‌లో కోవిడ్ కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్య, ప్రభుత్వం చెబుతున్న దానికంటే తొమ్మిది నుంచి పది రెట్లు ఎక్కువ అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నట్టు చెప్పారు. ఇలాంటి తరుణంలో మోడీ సర్కారు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలపై ప్రశ్నలను లేవనెత్తుతూ, అవన్నీ తప్పని ప్రచారం చేసుకున్నది.
కోవిడ్ సమయంలో కరోనా మరణాలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా లెక్కిస్తున్నారని భారత ప్రభుత్వంపై పలు ఆరోపణలు ఉన్నాయి. అంత్యక్రియల స్థలాల వద్ద పొడవైన క్యూలు, వందలాది మృతదేహాలు కాలిపోవడం, నదుల్లో తేలుతున్న మృతదేహాల చిత్రాలు, సంబంధిత వార్తలు కరోనా కాలంలో సోషల్ మీడియాలో, ప్రధాన వార్త పత్రికలు, ఛానెళ్లలో వచ్చిన విషయాన్ని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది కాకుండా, కోవిడ్ తప్పుడు నిర్వహణ, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం, లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు కలిగే కష్టాలు, కార్మికుల వలసలు, నిలిచిపోయిన వ్యాపారాలు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వంటి విషయాలను బీజేపీ మర్చిపోయి ఒక విపత్కర పరిస్థితిని సైతం తనకు అనుకూలంగా మలచుకుంటూ తప్పుడు ప్రచారాలకు పూనుకోవటం సరైన తీరు కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.










