Oct 01,2023 11:28

అలీఘర్‌ : బిజెపి ఎంపి సతీష్‌ గౌతమ్‌ అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కోల్‌ ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో తనతో పాటు వేదికపై వున్న మహిళా ఎంఎల్‌ఎ భుజాలపై తన చేతులు వేస్తూ గౌతమ్‌ కెమెరా కంటికి చిక్కారు. ఆ మహిళా ఎంఎల్‌ఎ చాలా అసౌకర్యానికి గురయ్యారు. ఆమె వెంటనే తన సీటును మార్చుకుని వేదికపై వేరే చోట కూర్చున్నారు. ఈ నెల 25న ఈ ఘటన చోటు చేసుకుంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యారు జయంతి సందర్భంగా శ్రీరామ్‌ బాంక్వెట్‌ హాల్‌లో కోల్‌ ఎంఎల్‌ఎ అనీల్‌ పరాశర్‌ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మంత్రులు, మాజీ మేయర్‌, ఇతర ప్రముఖులు పలువురు వేదికపై వున్నారు. బిజెపి ఎంఎల్‌ఎ బరౌలి థాకూర్‌ జైవీర్‌ సింగ్‌ ఈ విషయాన్నంతా పరిశీలించారు. ఈ వీడియో వైరల్‌ కాగానే, పలువురు బిజెపి నేతను తీవ్రంగా విమర్శించారు. ఇది బిజెపి అసలైన సంస్కృతి అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మీడియా ప్యానలిస్ట్‌ సురేంద్ర రాజ్‌పుత్‌ వ్యాఖ్యానించారు. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఎంపి సతీష్‌ గౌతమ్‌ చర్యను ఆ మహిళా ఎంఎల్‌ఎ తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంది.