Sep 27,2023 11:04
  • కామచ్చి అమ్మన్‌ ఆలయ పరిధిలో అక్రమాలు
  • నకిలీ పత్రాలు సృష్టించి పాగా
  • ఆలయానికి అప్పగించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

చెన్నై : ఆలయాల భూముల రక్షణ గురించి నిత్యం నీతులు చెప్పే బిజెపి నేతలు ప్రఖ్యాత కామచ్చి అమ్మన్‌ ఆలయ భూములనే కబ్జా చేశారు. అవినీతి, అక్రమాలతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కామచ్చి అమ్మన్‌ భూములను కైంకర్యం చేశారు. దీనిపై పలువురు మద్రాస్‌ హైకోర్టు ఆశ్రయించడంతో ధర్మాసనం కబ్జాదారులైన బిజెపి ఎమ్మెల్యేలను కడిగిపారేసింది. తక్షణమే ఆ భూములను కామచ్చి అమ్మన్‌ ఆలయానికి అప్పగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
             పుదుచ్చేరిలోని కామచ్చి అమ్మన్‌ ఆలయానికి చెందిన భూములను కామరాజ్‌నగర్‌, నెల్లితోప్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎ జాన్‌కుమార్‌, రిచర్డ్స్‌ జాన్‌కుమార్‌ మోసపూరితంగా ఆక్రమించుకున్నారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఎమ్మెల్యేలిద్దరూ తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆలయ భూములను ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారనే ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. 'ప్రజాప్రతినిధులు నీతివంతులుగా, నమ్మకమైన ప్రజా సేవకులుగా ఉండాలి. తమ తమ నియోజకవర్గాల్లో నివసించే ప్రజల అభ్యున్నతికి, చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషిచేయాలి' అని జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ప్రస్తుత కేసును విచారిస్తున్న సిబి-సిఐడి దర్యాప్తునకు ఎమ్మెల్యేలు లోబడి ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు కుమ్మకై ఆలయ భూములను కాజేశరని దేవస్థానం కార్యదర్శి సుబ్రమణ్యం, వి వేల్మురుగన్‌ అనే భక్తుడు ఈ పిటీషన్‌ వేశారు. 1935 మార్చి 6న ముత్తుస్వామి అనే వ్యక్తి వీలునామా ప్రకారం రెండు స్థిరాస్థులు ఆలయానికి లభించాయని, ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో భక్తులకు అన్నదానం చేయాలని దాత కోరుకున్నారని పిటీషన్‌దారులు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉండటంతో కల్పిత పత్రాలతో ఎమ్మెల్యేలు పాగా వేశారు. అయితే తాము అమాయకులమనీ, వేరే వ్యక్తుల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు నిందిత ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 6కు హైకోర్టు వాయిదా వేసింది.