ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : వజ్రకరూరు మండల పరిధిలోని కేజీబీవీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ధనలక్ష్మికి ఉత్తమ ప్రిన్సిపాల్‌గా రెడ్ ప్లస్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ షేక్షావలి అవార్డును అందజేశారు. రెడ్ ప్లస్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఎనిమిదవ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు గౌతమ్ రాజు,జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు హరిప్రసాద్,రెడ్ ప్లస్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సయ్యద్ షేక్షావలి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని ప్రతి ఒక్కరూ వారి పరిధిలో చేతనైనంత సహాయం తోటి వారికి చేయాలని సూచించారు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనం కొనసాగించాలని కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు సేవాభావం అలవాటు చేయాలన్నారు. సమాజ సేవలో ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ పేర్రర్, మదర్ థెరిసా, జ్యోతిరావు పూలే లాంటి సమాజ సేవకులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ గా ఎం ధనలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంతోపాటు క్రీడలలోను రాణించేలా విద్యార్థులతో స్నేహభావంతో మెలిగి కృషి చేసినందుకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ ఆర్థిక సహాయ సహకారాలతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు ప్రధానం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించి అవార్డులతో పాటు రివార్డులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ ప్లస్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు షేక్ మాఫిర్, కాజా మొయిద్దీన్, కేఎస్ మున్నా, లక్కిరెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.










