Nov 02,2023 11:13

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో ఆటోనగర్‌ను అభివృద్ధి చేయాలని, పాచిపెంట మండలంలో కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం సిఎంకు లేఖ రాశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజారక్షణ భేరి సందర్భంగా గ్రామాలు, పట్టణాలు సందర్శించామని, అందులో సాలూరు, పాచిపెంట మండలాల్లో స్థానిక ప్రజలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారని, వాటిని లేఖలో ప్రస్తావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో సాలూరు పట్టణం రవాణాకు పెద్ద కేంద్రాలలో ఒకటని, ఇక్కడ్నుంచి 1000 లారీలకుపైగా నడుస్తున్నాయని, రవాణాకు ట్రాన్సిట్‌ కేంద్రంగా ఉందని తెలిపారు. దీనిపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని వివరించారు. వర్క్‌షాప్‌లు, రిపేర్‌షాపులు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే వారికి ఉపాధి భద్రత కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిలో భాగంగానే ఆటోనగర్‌ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, కొంతకాలం క్రితం భూమి కేటాయించినా ఇంతవరకు ప్రారంభించలేదని వివరించారు. తక్షణం ఆటోనగర్‌ ప్రారంభించి ఉపాధికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో ఖరీఫ్‌లో బేయర్స్‌ కావేరి కంపెనీలు సరఫరా చేసిన కల్తీ మొక్కజొన్న విత్తనాలతో పదివేల ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతిన్నదని, కంకులు రాక రైతులు నష్టపోయారని వివరించారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కంపెనీలు అడ్రస్‌ లేకుండా పోయాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని వ్యవసాయ శాఖ ద్వారా ఎన్యుమరేషన్‌ చేసి ప్రైవేట్‌ కంపెనీపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేసిన ప్రైవేట్‌ కంపెనీలపై చర్య తీసుకోవాలని కోరారు.