- పెనుకొండలో 189 గుడిసెల తొలగింపు
- బయటపడేసిన సామగ్రికి నిప్పు
- వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల అరెస్టు, విడుదల
ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం జిల్లా) : పేదలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపారు. నిస్సహాయులను చేసి వారి గుడిసెలను తొలగించారు. గుడిసెల్లో ఉన్న సామగ్రిని ఒక చోట వేసి తగలబెట్టారు. అధికారుల చర్యలను అడ్డుకోబోయిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను అరెస్టుచేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలు వేసుకున్న 189 గుడిసెలను రెవెన్యూ అధికారులు, పోలీసులు శుక్రవారం తొలగించారు. గుడిసెల తొలగింపును అడ్డుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు తదితరులను అరెస్టు చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు సిపిఎం నాయకులు హరిని ఆయన ఇంటి వద్దే అరెస్టు చేశారు. వారందరినీ సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేశారు. తాము ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్ధాక్షిణ్యంగా తొలగించారని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే అధికారులు కక్షగట్టి వాటిని తొలగించడం దారుణమన్నారు. తమకు నిలువనీడ లేకుండా చేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ తేల్చి చెప్పారు.
పేదల గుడిసెల తొలగింపునకు నిరసనగా రాస్తారోకో
పేదల గుడిసెల తొలగింపును నిరసిస్తూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ నాయకులు, పేదలు పట్టణంలోని ఎన్‌టిఆర్ సర్కిల్‌ల్లో వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. అధికారులు, పోలీసుల తీరును ఖండించారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు రమణకు స్వల్ప గాయం కావడంతో ఆయననూ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్.వెంకటేష్, సోమందేపల్లి సిపిఎం నాయకులు వెంకటేష్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో సిసిఎం నాయకులు, మహిళలు స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం వారికి అండగా ఉంటుందని నాయకులు చెప్పారు.










