Aug 02,2023 21:13
  • గాయంతో వైదొలిగిన లక్ష్యసేన్‌
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సిడ్ని: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో పివి సింధుతో పాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌ తొలి అడ్డంకిని అధిగమించారు. మహిళల సింగిల్స్‌లో ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న పివి సింధు 21-18, 21-13తో సహచర క్రీడాకారిణి ఛాలిహాపై, ఆకర్షీ కశ్యప్‌ 21-15, 21-17తో జొహో(మలేషియా)పై వరుససెట్లతో గెలిచారు. మరో పోటీలో మాల్విక బన్సోద్‌ 20-22, 11-21తో వైపి పై(చైనీస్‌ తైపీ) చేతిలో ఓడింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-18, 21-7తో 8వ సీడ్‌ కెంటో నిషీమోటో(జపాన్‌)పై, ప్రియాంశు రాజవత్‌ 21-12, 21-16తో టంగ్‌(ఆస్ట్రేలియా)పై గెలిచి రెండోరౌండ్‌కి దూసుకెళ్లారు. ఇక మిధున్‌ మంజునాథ్‌ 21-19, 21-19తో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ లో కెన్‌ యూ(సింగపూర్‌)పై, హెచ్‌ఎస్‌ ప్రణయ్ 21-18, 16-21, 21-15తో సివై లీ(హాంకాంగ్‌)పై పోరాడి నెగ్గాడు. మరో పోటీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 0-5తో సహచర ఆటగాడు కిరణ్‌ జార్జితో మ్యాచ్‌ ఆడుతూ గాయం కారణంగా మధ్యలోనే నిష్క్రమించాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ జోడీ 14-21, 18-21తో తైపీ జోడీ చేతిలో, బిఎస్‌ రెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 13-21, 12-21తో జపాన్‌ జోడీ చేతిలో తొలిరౌండ్‌ పోటీల్లోనే ఓడి ఇంటిదారి పట్టారు.