డిస్పూర్(అస్సాం) : ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పై.. హిమంత భార్య రినికి భూయాన్ శర్మ రూ.10 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ కేసుపై సీనియర్ అడ్వకేట్ దేవజిత్ సైకియా పిటిఐకు తెలిపిన వివరాల మేరకు.. కామరూప్ సివిల్ జడ్జి కోర్టులో ఈ శుక్రవారం కేసు దాఖలైందని, ఈ నెల 26వ తేదీకి ఈ కేసు విచారణకు వస్తుందని తెలిపారు. ఎంపీ గౌరవ్ గొగొయ్ వరుస ట్వీట్ల ఆధారంగా ఈ పరువునష్టం దావా వేసినట్లు సైకియా పేర్కొన్నారు. తన క్లయింట్ శర్మకు చెందిన ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్‌మెంట్స్‌కు సంబంధించి సోషల్ మీడియాతో ఎంపీ గొగోరు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదన్నారు. గువాహటి డిజిటల్ మీడియాలో ఒకటైన ది క్రాస్ కరెంట్ రాసిన కథనం ప్రకారం... నగౌన్ జిల్లాలోని దరిగజి గ్రామంలో .. 50 భిగాలకు పైగా.. అంటే సుమారు 17 ఎకరాల సాగుభూములు ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ కంపెనీ అవసరాల నిమిత్తం కొనుగోలు చేశారని ఆ వార్తలో రాశారు. దాని ఆధారంగానే ఎంపీ గొగోరు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవినీతిపై వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.










