ప్రాణి పుట్టుక.. అందుకుగాను జరిగే మార్పులు.. మనం సామాన్య శాస్త్రంలో చదువుకున్నాం. మానవులలో అండం, శుక్రకణం కలయికతో పిండం ఏర్పడుతుంది. అది పెరుగుతూ అనేక విభజనలు, ఆర్‌ఎన్‌ఏ, డిఎన్‌ఏ, మైటోకాండ్రియా.. తదితర కణాల పరస్పర మార్పులు జరిగి బిడ్డ పెరుగుతుంది. పిండం పెరిగే దశను ఎంబ్రియోజెనెసిస్ అనీ, అధ్యయనం చేసే శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం (ఎంబ్రియాలజీ) అంటాం. ఇక్కడ అండం, శుక్రకణం లేకుండానే మానవ పిండం ఏర్పాటు.. అలా ఎందుకు.. చట్ట పరిధిలోనేనా.. లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
సాధ్యమేనా.. అనుకునేలా శుక్ర కణం, అండం లేకుండా కృత్రిమ మూల కణాలతో తొలిసారి 'నమూనా పిండాన్ని' రూపొందించారు వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన జీవశాస్త్రవేత్త, ప్రొఫెసర్ జాకబ్ హన్నా బృందం. అది గర్భంలో సహజంగా ఏర్పడిన 14 రోజుల పిండంలానే ఉందంటున్నారు.
ఎవరికి ఉపయోగం..
మనిషి పుట్టుకలోని తొలి క్షణాలను అధ్యయనం చేసేందుకే ఈ ఎంబ్రియో మోడల్స్‌ను రూపొందిస్తున్నట్లు బృందం చెప్పింది. అండంతో వీర్యం ఫలదీకరణం చెందిన మొదటి వారాల్లో జరిగే అనేక పరిణామాలపై పరిశోధిస్తామన్నారు. గర్భస్రావం, పుట్టుకలో లోపాలు, అసలు బిడ్డలు పుట్టక పోవడానికి కారణాలు తెలుసుకోవడానికే ఈ ప్రయత్నమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ దీని గురించి పూర్తి అవగాహన లేదని, పరిమిత జ్ఞానమేనని' వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ జాకబ్ హన్నా. ఈ నమూనాలను ఉపయోగించి, గర్భస్రావాలు, సంతానలేమి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా ఐవీఎఫ్ విజయవంతమయ్యేలా చేయవచ్చని వారు వ్యక్తం చేస్తున్నారు.
అవయవాలు ఏర్పడే సమయంలో, వారసత్వ, జన్యుపరమైన వ్యాధులను తెలుసుకోవడానికి ఎంబ్రియో మోడల్స్ సహాయపడతాయంటున్నారు శాస్త్రవేత్తలు.

పరిశీలనలో.. ఫలితం..!
ఈ కణాల మిశ్రమం జరిపే చర్యను శాస్త్రవేత్తలు గమనిస్తే, మిశ్రమంలోని ఒక్క శాతం పదార్థం మాత్రమే మానవ పిండాన్ని పోలి ఉండేలా ఏర్పడటానికి సన్నద్ధమైనట్లు గుర్తించారు. దీనిపై గర్భ నిర్ధారణ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని, హర్మోన్లనూ విడుదల చేసిందని తెలిపింది బృందం. 'ఈ క్రెడిట్ అంతా కణాలదే. మిశ్రమాన్ని కరెక్టుగా తయారు చేసి, అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే ఆ మిశ్రమం పని ప్రారంభమవుతుంది. ప్లాసెంటాగా మారే ట్రోపోబ్లాస్ట్‌లు పిండం చుట్టూ చేరతాయి. ప్లాసెంటా కణాలు చుట్టుముట్టకపోతే పిండంలోని ఇతర భాగాలు ఏర్పడవు. రక్తంతో నిండిన 'లకునా' అనే క్యావిటీ తల్లి పోషకాలను బిడ్డకు బదిలీ చేస్తుంది. అదొక అద్భుత విషయం' అంటారు ప్రొఫెసర్ హన్నా.
పిండం 14 రోజుల దశను దాటిన తర్వాత కూడా సహజ పిండాన్ని అనుకరిస్తుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
శాస్త్రవేత్తల అభిప్రాయాలు..
పాంపు ఫాబ్రా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్, హెల్త్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ అల్ఫొన్సో మార్టినెజ్ అరియాస్, 'ఇదొక కీలకమైన పరిశోధన. మొదటిసారి మూల కణాలతో మానవ పిండ నమూనా ఏర్పడింది. మనిషి పుట్టుకపై అనేక అధ్యయనాలకు ఇది తలుపులు తెరిచింది' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ లావెల్ బ్యాడ్జ్ మాట్లాడుతూ, 'ఈ పిండ నమూనాలు చాలా సహజంగా ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను ఇంప్రెస్ అయ్యాను' అన్నారు.
పరిశోధన ఎలా..?
శరీరంలో ఏదైనా కణజాలంగా మారగల సామర్థ్యాన్ని ఈ మూలకణాలకు ఆపాదించి, రీప్రోగ్రామ్ చేశారు. తర్వాత రసాయనాలను ఉపయోగించి, మానవ పిండం ప్రారంభదశలో కనిపించే నాలుగు రకాల కణాలుగా మార్చారు. అవి పిండంగా మారే ఎపిబ్లాస్ట్ కణాలు, ప్లాసెంటాగా మారే ట్రోపోబ్లాస్ట్ కణాలు, యుటెరస్‌లో యాక్ సాక్ ఏర్పడేందుకు సహకరించే హైపోబ్లాస్ట్ కణాలు, ఎక్స్‌ట్రాఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ కణాలు.. ఇలా మొత్తం 120 కణాలను ఒక సరైన నిష్పత్తిలో కలిపారు.
చట్టబద్ధం.. చట్ట విరుద్ధం!
ముడి పదార్థం పిండ పరిశోధన అనేది పూర్తిగా చట్టబద్ధం.. నైతికం.. సాంకేతికపరమైనదే. చాలా వేగంగా అభివద్ధి చెందుతోంది కూడా అంటూ ఈ పరిశోధన వివరాలను 'నేచర్' అనే జర్నల్‌లో ప్రచురించారు. అన్ని కీలక నిర్మాణాలను అనుకరిస్తూ పూర్తిచేసిన మొదటి పిండ నమూనా ఇది. ఇంతకుముందు ఇలాంటి పరిశోధన జరుగలేదని బృందం పేర్కొంది.
ఈ నమూనాలు పరిశోధనలకు మాత్రమేనని, వీటితో గర్భం ధరించడం అసాధ్యం, అనైతికం, చట్టవిరుద్ధమని పరిశోధకులు నొక్కి చెప్తున్నారు.










