Oct 22,2023 22:15

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని, ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. సిపిఎం అభిప్రాయాన్ని ఆదివారం తన ట్విట్టర్‌లో పొందుపరిచారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి గొంతు నొక్కడానికి, ప్రతిపక్షాలను అణచివేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇటువంటి ప్రేలాపనలు అని విమర్శించారు. పోలీస్‌ అమరవీరుల సభను దీనికి ఉపయోగించుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్వచనాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీని వ్యతిరేకించేవారందరూ దేశద్రోహులుగా బిజెపి చిత్రీకరించినట్లుగా, మీడియా సంస్థలు వైర్‌, న్యూస్‌క్లిక్‌పై దాడులు చేసి జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్ర వేసినట్లుగా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కూడా మోడీని అనుసరిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల నిర్వచనాన్ని మార్చాలని ఆయన చేసిన ప్రతిపాదన సంఘ వ్యతిరేక శక్తులకే తోడ్పడుతుందని పేర్కొన్నారు. దాడులు చేస్తున్నవారు, హత్యలు చేస్తున్నవారు, అత్యాచారాలు చేస్తున్నవారు, ప్రజాధనాన్ని లూటీ చేసే వారిని వదిలేసి ప్రజా సమస్యలపై పోరాడేవారిని అసాంఘిక శక్తులతో కలిపి ముఖ్యమంత్రి పునర్‌ నిర్వచించాలని పిలుపునివ్వడం ప్రజాస్వామ్యానికే కళంకమని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలను, భిన్నాభిప్రాయాలను గౌరవించే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని ప్రజాస్వామ్యవాదులకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు.