- విభజన హామీలను అమలు చేయని కేంద్రం
- బిజెపి నుంచి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బయటకు రావాలి
- ప్రజారక్షణ భేరి యాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్
ప్రజాశక్తి ప్రతినిధి-యంత్రాంగం:కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గపూర్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ప్రారంభమై నల్లమాడ, కదిరి మీదుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు చేరుకుంది. అంతకుముందు ప్రజా రక్షణభేరి బస్సు యాత్రకు బైక్, ఆటోల ర్యాలీతో స్వాగతం పలికారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో గఫూర్ మాట్లాడుతూ.. విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న ప్యాకేజీని కేంద్రం నుంచి రాబట్టడంలో జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి విషయంలో ఇద్దరూ మోసం చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లాకు హంద్రీనీవా తీసుకొస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమ, రాయదుర్గంలో కుదురేముఖ్ ఉక్కు పరిశ్రమ, చిత్తూరులో బెల్ పరిశ్రమ, కర్నూలులో డిఫెన్స్ ఫ్యాక్టరీ పెడతామని హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా మోసం చేసిన బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు జతకడుతున్నాయని మండిపడ్డారు. మతోన్మాద బిజెపి చెర నుంచి ఆ పార్టీలు బయటకు రావాలని సూచించారు. బిజెపి మతత్వ అజెండాను అమలు చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాసి మనువాదాన్ని దేశంలో అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీలు, దళితుల పట్ల దాడులు చేయిస్తోందన్నారు. కార్పొరేటర్లకు కొమ్ముకాస్తూ లక్షలాది కోట్ల రూపాయలను రాయితీగా ప్రకటిస్తున్న కేంద్రం ఇటు కార్మికులకు, అటు కర్షకులకు చేసిందేమి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలయతాండం చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఫలితంగా వేలాది మంది నగరాలకు వలసలు వెళుతున్నారని తెలిపారు. రాజకీయంగా విపక్షాలను, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్బంధించడం, అణచివేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమని పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలు భూమిని కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలు చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్ధాక్షణంగా కూల్చివేయడం దారుణమన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేసి పెద్దలకు కట్టబెట్టిందన్నారు. ఇందులో నుంచి ఏడాదికి రూ.ఐదు వేల కోట్లు రాయలసీమ ప్రాంతానికి ఖర్చు పెట్టినా ఈపాటికి అభివృద్ధి చెంది ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు డి రమాదేవి మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులదరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలకు ముందు వైసిపి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకుండా విస్మరించిందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరావు ప్రసంగించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులు భాస్కరయ్య, శివనాగవేణి, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.










