Apr 02,2023 08:57

'మోర్‌ లోకల్‌ ఈజ్‌ మోర్‌ గ్లోబల్‌'. ఇదే ఇప్పుడు భారతీయ సినిమాని ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న ఫార్ములా. మొన్న జైభీమ్‌, నిన్న కాంతార, నేడు బలగం. ప్రాంతాలు ఏవైనా కావచ్చు. సంస్కృతి వేరే కావచ్చు. కానీ ఇవన్నీ మనిషి జీవితానికి అతి దగ్గరగా పోయిన జీవిత కథా చిత్రాలు. తెలుగు సినిమాపై ఎప్పటి నుంచో ఇంటా, బయటా ఒక పెద్ద కామెంట్‌ వినిపించేది. ''ఎందుకు మీరు ఎప్పుడూ ఈ కమర్షియల్‌ మసాల యాంగిల్‌ సినిమాలే తీస్తారు? రియల్‌ స్టిక్‌ సినిమాలు తీయ్యరా?'', ''అవునబ్బా! మనవాళ్ళు మలయాళం, కొరియన్‌ సినిమాల మాదిరి సింపుల్‌గా ఉండే కథలెందుకు రాసుకోరు?''. వీటికి సమాధానంగా నిలిచేది 'బలగం' చిత్రం.
కథలోకి వెళ్తే.. చిన్నపల్లెలో బతుకుదెరువు కోసం సాయిలు (ప్రియదర్శి) అనే యువకుడు పడరాని పాట్లు పడుతుంటాడు. ఈ క్రమంలో అప్పులపాలై తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న సాయిలు కట్నం కోసం ఆశపడి పెళ్లికి సిద్ధమవుతాడు. ఇంతలో తాత కొమరయ్య (సుధాకర్‌ రెడ్డి) చనిపోతాడు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. దూరంగా ఉంటున్న చిన్న కొడుకు-కోడలు, పట్టింపుల మధ్య ఇంటికి రాకుండా ఆగిపోయిన కూతురు లచ్చిమి (లక్ష్మి), అల్లుడు నారాయణ (మురళీధర్‌ గౌడ్‌), మనవరాలు సంధ్య (కావ్య కళ్యాణ్‌ రాం) చివరిచూపు కోసం వస్తారు. పెద్దల పట్టింపుల మధ్య సాయిలు ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోతుంది. పైగా కర్మల రోజున పిండాన్ని కాకులు ముట్టవు. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య సాయిలు పెళ్లి ఏమైంది?.. బావా-బావమరుదుల మధ్య పట్టింపులు తగ్గాయా?.. కాకులు చివరికి పిండాన్ని ముట్టాయా? లేదా? అన్నదే మిగతా కథ.
'బలగం' కథ చాలా చిన్నదే. పెద్ద ఇతివృత్తంతో కూడుకున్న కథాంశమేమీ కాదు. కానీ మనిషి అనుభవాన్ని దాటిపోని బంధుత్వాలు, బంధాలు, పట్టింపులు, చావు చుట్టూ కథ అల్లిన తీరు బాగుంది. అలాగనీ పెద్ద తాత్విక నేపథ్యమున్నది కూడా కాదు. తెలంగాణాలో ఒక చిన్న పల్లెటూరి నేపథ్యంగా సాగే కథ. ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను సీటు అంచుకు చేర్చే రోమాంచిత దృశ్యాలూ లేవు. చొక్కాలు విప్పించే ఎలివేషన్స్‌ కూడా రావు. కానీ, పాత్రల మనస్తత్వాల నడుమ ఏర్పడే రాపిడి, పట్టుదలతో మొండికేసి బయట పడలేకపోతున్న మనసుల సంఘర్షణ, సంస్కృతి సంప్రదాయాలతో ముడివేసుకొన్న భావోద్వేగాలు.. ప్రేక్షకులను ఆసాంతం కథలోకి లీనమయ్యేలా చేస్తాయి. వీటి మధ్య తెలంగాణా భాష, యాస, చావు ముందు తీన్మార్‌, దింపుడు కళ్లెం, నల్లి బొక్క లొల్లి, దావతు, సోపతిగాళ్లు, సీటి పాట, మిత్తి పైసల పంచాయతీ.. ఇవన్నీ వెరసి 'బలగం'ని మరింత బలంగా జేశాయి. తనకు సహజమైన 'తెలంగాణా పక్కింటి పోరగాడు' తీరుకు ఈ కథ బాగా సరిపోయింది. ఇక హాస్యం, భయం, సంతోషం, బాధ.. ముఖ్యంగా తాత పొలంలో పడుకొనే మంచాన్ని సర్దుతూ 'బతికున్నన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానే తాత... అంటూ సాగే సన్నివేశంలో కంటనీరు తెప్పిస్తాడు నటుడు ప్రియదర్శి. చక్కగా పూసగుచ్చినట్టు కథనం నడపడంలో సినిమా విజయాన్ని ఖరారు చేసింది.
నటుడిగా అనేక సినిమాలు చేసిన కథానాయకుడు ప్రియదర్శి మాత్రం చాలా చూజీగా ఉన్నారు. 'మల్లేశం' తర్వాత కథానాయకుడిగా చేసిన చిత్రమిది. పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇక కావ్య కళ్యాణ్‌ రాం కూడా పాత్రకు తగ్గ సహజత్వాన్ని ప్రదర్శించింది. లక్ష్మి-జయరాంలు చేసిన అన్నా-చెల్లెళ్ల పాత్రలు కథకు కీలకమైన న్యాయం చేశాయి. మురళీగౌడ్‌ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకొన్నాడు. వేణు, రచ్చ రవి, రోహిణీలు కథకు బలం చేకూర్చుతూనే హాస్యం పండించారు. మిగతా అన్ని పాత్రలూ పరిధి మేరకు కథకు సహజత్వాన్ని అందించడంలో సహకరించాయి. చివర్లో పాటపాడుతూ నటించిన బుడగజంగాల కళాకారులైన కొమురమ్మ, మొగిలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.
సినిమాకి మాట ఆగిపోయిన చోట పాట అవసరమవుతుందంటారు. కానీ ఈ సినిమాకి పాటలే మాటలయ్యాయి. కథనాన్ని కూడా నడిపాయి. సినిమా మొదలు, ముగింపు పాటలే అంటే ఈ సినిమాకు అవెంతటి జీవం పోశాయో అర్థం చేసుకోవచ్చు. బతుకును పెనవేసుకొన్న జీవన గీతాలు. ఇది తెలంగాణకు, పాటకు మధ్యనున్న గాఢతను తెలియజేస్తుంది. ఈ సినిమాతో కాసర్ల శ్యామ్‌ (గీత రచయిత) సింగిల్‌ కార్డ్‌ జాబితాలలోకి, భీమ్స్‌ సిసిరోలియో సత్తా కలిగిన సంగీత దర్శకుల వరసలోకి బలంగా చేరిపోతారు.
కథా నాయకులు, రచయితలే దర్శకులవుతున్న తరుణంలో వేణు యెల్దండి ఒక హాస్యనటుడు నుంచి దర్శకత్వం వైపు విజయవంతమైన అడుగు వేశారు. ఆత్మవిశ్వాసంతో రాసుకొన్న కథ, ఇన్నాళ్ళ తన సినీ, గ్రామీణ జీవితం ఎంతోగానే అతడికి ఉపయోగపడ్డాయి. చిన్న కథకోసం పెద్ద నిర్మాత దిల్‌ రాజు ముందుకు రావడం తనకు మరింత కలిసొచ్చింది. తన దర్శకత్వంతో ఒక దర్శకుడిగా నిలదొక్కుకోగలడన్న నమ్మకం కలిగించాడు. కెమెరామెన్‌ ఆచార్య వేణు కథకు తగ్గ సహజత్వాన్ని చిత్రీకరించడంలో అద్భుతమైన పనితీరును, కూర్పులో మధు నేర్పుని కనబరిచాడు. 'బలగం' విజయం తెలుగు సినీ పరిశ్రమపై రానున్న కాలంలో తప్పక తెలుగు జీవితాలకు దగ్గరగా ఉండే సినిమాలు ఉండనున్నాయనే నమ్మకానికి 'బలగం' నిలుస్తుంది.

- మ.మో.రె, 9989894308

టైటిల్‌ : బలగం, నటీనటులు: ప్రియదర్శి పులికొండ, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, యెల్దండి వేణు తదితరులు
పాటలు: కాసర్ల శ్యామ్‌, సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: ఆచార్య వేణు
దర్శకుడు : వేణు యెల్దండి
నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత