- కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి
- ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్టాన్లీ
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :మత్స్యకారులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత మత్స్యకారులు, మత్స్య కార్మిక సమైక్య (ఎఐఎఫ్‌ఎఫ్ డబ్ల్యుఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్టాన్లీ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై పోరాడుతున్న ప్రతినిధులతో ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్ జాతీయ సమావేశాలు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించున్నామని, ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గంటారని తెలిపారు. కాకినాడలోని సుందరయ్య భవన్‌లో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 7 వేల కిలో మీటర్లకుపైగా ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని నమ్ముకుని కోట్లాది మంది మత్స్యకారులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వేటే జీవనాధారంగా జీవిస్తున్నారన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని, అయినప్పటికీ నిస్వార్ధంగా మత్స్య సంపదను తీసుకొచ్చి ఆయా రాష్ట్రాలకు రూ.వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.5 వేల కోట్ల బడ్జెట్‌ను సగానికి తగ్గించి మత్యకారులకు అన్యాయం చేశారన్నారు. బ్లూ ఎకానమీ ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరుతో సముద్రంలో ఉన్న 138 లోహాలను వెలికితీయడానికి పార్లమెంట్‌లో చట్టం చేసి సముద్ర తీరాన్ని 100 కిలో మీటర్లు చొప్పున ముక్కలు చేసి ప్రయివేటు బ్యాంకుల ద్వారా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఒ 217 ద్వారా ఆక్వా హబ్‌లను పేర మత్స్య రంగాన్ని కార్పొరేట్‌పరం చేస్తుందన్నారు. ఈ జిఒను మత్స్యకారుల సంఘాలు వ్యతిరేకించినా చాప కింద నీరులా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కర్రి చంద్రశేఖర్, కొల్లాటి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆఫీస్ బెరర్స్ సభ్యులు చెక్క రమణి, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు జరోనహల్ వల్లే, జిన్నహాలే, కేరళ ప్రతినిధులు పాల్గోన్నారు.










