Jul 14,2023 12:40

ఢిల్లీ :భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకు ఆమెకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు ఏజెన్సీ ఆమెకు రెండు వారాల గడువిచ్చింది. డోపింగ్‌ నిరోధక నియమాలు పాటించడంలో వినేశ్‌ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని నోటీసుల్లో పేర్కొంది. తమ రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌లో వినేశ్‌ పేరును చేర్చినట్లు 2022 మార్చి, 2022 డిసెంబరులో ఈ-మెయిల్‌ చేసినట్లు తెలిపింది. యాంటీ డోపింగ్‌ నిబంధనల ప్రకారం.. ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయం ఫైల్‌ చేయాల్సి ఉంటుందని చెప్పింది. చెప్పిన ప్రదేశంలో చెప్పిన టైంకి డోపింగ్‌ పరీక్షలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అయితే, వినేశ్‌ ఇటీవలే ఇచ్చిన ఫైలింగ్‌ లో జూన్‌ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపట్‌ లో టెస్టింగ్‌ కు అందుబాటులో ఉంటానని చెప్పినట్లు ఏజెన్సీ గుర్తు చేసింది. దీంతో వినేశ్‌ చెప్పిన సమయానికి డోపింగ్‌ కంట్రోల్‌ ఆఫీసర్లను ఆ ప్రదేశానికి పంపినట్లు తెలిపింది. అయితే, ఆ లొకేషన్‌ లో వినేశ్‌ అందుబాటులో లేకపోవడంతో అధికారులు టెస్టింగ్‌ చేయలేకపోయారని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే వినేశ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని ఏజెన్సీ నోటీసుల్లో తెలిపింది. ఈ నోటీసులపై 14 రోజుల్లో తన స్పందన తెలియజేయాలని వినేశ్‌ను ఏజెన్సీ ఆదేశించింది.