Jul 30,2023 07:45
  • నకిలీ పత్రాలను గుర్తించిన తహశీల్దారు

ప్రజాశక్తి - భవానీపురం (విజయవాడ) : ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో శనివారం మరో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు అయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బీ విజయవాడ భవానీపురం హెచ్‌బి కాలనీ ప్రాంతంలో నివాసముంటున్నారు. మస్తాన్‌బీ ఈ నెల 24న తన కిడ్నీని రామవరప్పాడులో నివాసముండే సత్యవతికి దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ పశ్చిమ తహశీల్దారుకు దరఖాస్తు చేశారు. దీనిపై తహశీల్దారు విచారించగా అవి నకిలీ సర్టిఫికెట్లని గుర్తించారు. మస్తాన్‌బీ పేరును ఆధార్‌ కార్డులో తమ్మిశెట్టి రాజీగా మార్చుకున్నట్లు విచారణలో తేల్చారు. సుమారు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు కిడ్నీ మార్పిడికి బేరం కుదుర్చుకున్నట్లు, కొంత అడ్వాన్స్‌ కూడా తీసుకున్నట్లు తహశీల్దారు మీడియాకు వెల్లడించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నీ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చారు. అలాగే, రెండు రోజుల క్రితం విజయవాడ భవానీపురం బాలభాస్కర్‌ నగర్‌కు చెందిన గాడి చిన్న అనే మహిళ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి దీపక్‌రెడ్డిని తన పెద్దనాన్న కుమారుడిగా చూపి కిడ్నీ దానానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. విచారణలో అవి నకిలీ పత్రాలని తేలడంతో తహశీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ కార్తీక్‌ అనే వ్యక్తి, మరో మహిళ బ్రోకర్లుగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని భవానీపురం సిఐ సలాం తెలిపారు.