- బిసి జనగణనకు కేంద్రం కట్టుబడాలి
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో మెగా డిఎస్‌సిని వెంటనే ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కష్ణయ్య సిఎం జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం జరిగిన బిసి యువత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు ఒబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగాలను ఇచ్చినట్లుగానే ఉపాధ్యాయుల పోస్టులు కూడా నిరుద్యోగ యువతకు ఇవ్వాలన్నారు. బిసి జనగణన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకొని బిసి జనగణనకు సానుకూలత ప్రకటించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సు మేరకు కేంద్రంలో ఒబిసి మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ సిపిటి కోర్సుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేయాలన్నారు. బిసి కార్పొరేషన్‌లకు వెంటనే నిధులు, బాధ్యతలు కేటాయించాలని కోరారు.










