Aug 16,2023 17:47
  • ఏపిఎల్‌ ప్రారంభోత్సవ సభలో మంత్రి అమర్నాథ్‌

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖలోని ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో నేటి నుండి 27వ తేదీ వరకు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ నటి శ్రీ లీల సందడి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 6 టీములు ఈ పోటీలలో తలపడనున్నాయి. భారత్‌ క్రికెట్‌ జట్టులో ఆడుతున్న కే.ఎస్‌.భరత్‌, హనుమ విహారి వంటి ప్లేయర్లు ఈ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఐపీఎల్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్లలో స్థానం సంపాదించి రాష్ట్రానికి పేరు తేవాలని అన్నారు. సీజన్‌-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇందులో పలువురు క్రీడాకారులు ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నారని ఆయన అన్నారు. భారత్‌ క్రికెట్‌ జట్టులో కీలక భూమికి పోషించిన అంబటి రాయుడు, భరత్‌ తదితరుల క్రికెట్‌ ను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలోని మూడు స్టేడియంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్రికెట్లో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్టోబర్‌ రెండవ తేదీ నుంచి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించనున్నారని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. 40 రోజులు పాటు సాగే ఈ పోటీలలో మెరుగైన ప్రతిభ కనబరిచే వారికి వారు మరింత ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని మంత్రి అమర్నాథ్‌ వెల్లడించారు.

CRICKET