Mar 12,2023 13:17

నటుల్లో చాలా మంది నేరుగా హీరోలుగా కాకుండా ముందు ప్రతినాయక పాత్రలు పోషించినవారే. అలాంటివారిలో కొంతమంది ఆ తర్వాత అవకాశాలు అందుకుని, హీరోలుగానూ ఎదిగారు. అలాంటి నటుల్లో బాబీ సింహా ఒకరు. బాబీ తెలుగువాడే అయినా తమిళ నాట మంచి పేరు తెచ్చుకున్న హీరో. అయితే కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తూ మంచిపేరు తెచ్చుకున్నాడు. తెలుగులో 'డిస్కో రాజా', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాల్లో విలనిజం ప్రదర్శించిన ఆయన ఇటీవల 'వసంత కోకిల'లో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా', 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి బాబీ హీరోగా మెప్పించగలిగారా ? వసంత కోకిల ఎవరు ? తెలుసుకుందాం..

చిత్రం : వసంత కోకిల
నటీనటులు : బాబీ సింహా, కశ్మీరా పరదేశి, రమాప్రభ,
ఆర్య, శరత్‌బాబు తదితరులు
సంగీతం : రాజేష్‌ మురుగేశన్‌
కూర్పు : వివేక్‌ హర్షన్‌
ఛాయాగ్రహణం : గోపీ అమర్‌నాథ్‌
నిర్మాతలు : రజనీ తాళ్లూరి, రేష్మి
దర్శకత్వం : రమణన్‌ పురుషోత్తమ
ఓటీటీ : ఆహా,
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.

థలోకి వెళ్తే.. రుద్ర (బాబీ సింహా) ఓ ఐటీ ఉద్యోగి. చాలా వర్క్‌హాలిక్‌. నిద్రాహారాలు కూడా మాని, పని మీదనే దృష్టి పెడతాడు. ఓ భారీ ప్రాజెక్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశాన్ని అందుకుని, కంపెనీ పెద్దలు నిర్ణయించిన సమయాని కంటే ముందుగానే పూర్తిచేస్తానని మాటిస్తాడు. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిద్రాహారాలు మానేసి మరీ పనిచేస్తుంటాడు. రుద్ర ఆరోగ్య పరిస్థితి చూసి షాకైన అతడి ఫ్రెండ్‌ నిషా (కశ్మీర పరదేశి) ఆస్పత్రికి తీసుకెళ్తుంది. నిద్రలేమి వల్ల అలా జరుగుతుందని, ఇకపై విశ్రాంతి తీసుకోకపోతే ప్రమాదమని వైద్యులు రుద్రకు సూచిస్తారు. అయినా లెక్కజేయకపోవడంతో నిషాతో గొడవలు వస్తాయి. రుద్రను ఈ సమస్య నుంచి బయటపడేసేందుకు ఒకరోజు బయటకు వెళ్లాలని ఫిక్స్‌ అవుతుంది. అలా ఇద్దరూ కలిసి వెళ్లే క్రమంలో అనుకోకుండా అడవిలో ఉన్న 'వసంత కోకిల' అనే హోటల్‌లో బస చేయాల్సి వస్తుంది. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఉన్నట్లుండి నిషా కనిపించకుండా పోతుంది. అక్కడికి కమల్‌ (ఆర్య) ఎందుకొచ్చాడు? ఈ కథలో కమల్‌ పాత్ర ఏంటి? అనేదే మిగతా కథ.
         మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సస్పెన్స్‌ చిత్రంగా దీన్ని పరిగణించవచ్చు. మనిషి ఒక్కరోజులో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే అంశాన్ని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీవితానికి ముడిపెట్టి, తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు పురుషోత్తమ. ఒక సాధారణ ప్రేమకథగా ప్రారంభమై, సడెన్‌గా టైమ్‌ లూప్‌ వైపు మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత మరిన్ని సక్సెస్‌ఫుల్‌ హాలీవుడ్‌ సినిమాలను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా 2006లో వచ్చిన 'ట్రయాంగిల్‌', 2010లో వచ్చిన 'ఇన్‌సెప్షన్‌' ఛాయలు ఇందులో కనిపిస్తాయి. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి అనుకునే నేటి యువత ఆలోచనకు ఈ సినిమా ప్రతిబింబం. నిద్రలేకపోతే కష్టమే అనే ఒకే ఒక్క పాయింట్‌తో సినిమాని పూర్తి సందేశాత్మక చిత్రంగా మలచకుండా, దానికి టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌, సస్పెన్స్‌ను జోడించడం కొత్త ప్రయత్నం. అయితే, తక్కువ నిడివి (106 నిమిషాలు) లో ఇన్ని నేపథ్యాలతో కథను నడిపించడంతో ప్రేక్షకులందరూ దాన్ని ఫాలో అవడం కష్టమే. క్లారిటీ మిస్‌ అయ్యే అవకాశం ఉంది ఈ చిత్రంలో. కథా నేపథ్యం పరంగా ఊహించని విధంగా ట్రాక్‌ మారుతుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే వసంతకోకిల హోటల్‌ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.
          హీరోయిన్‌ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే హీరో ఫార్మసీకి వెళ్లి మెడిసిన్‌ తెచ్చే ప్రయత్నం చేస్తాడు. కట్‌ చేస్తే, హీరో తిరిగి హోటల్‌కు చేరుకునే సమయానికి హీరోయిన్‌ అక్కడ ఉండదు. ఆమె ఏమైందో తెలుసుకోవాలనే ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. టైమ్‌లూప్‌ కాన్సెప్ట్‌తో ఇచ్చిన ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ వావ్‌ అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఇంకేదో జరగబోతోందనే ఉత్సుకత పెంచుతుంది. లూప్‌ సన్నివేశాలతో సెకండాఫ్‌ వేగంగా సాగుతుంది. కమల్‌గా ఆర్య ఎంట్రీని ఊహించడం కష్టం. ఆయన సడెన్‌ సర్‌ప్రైజ్‌కు షాక్‌ అవ్వాల్సిందే. నిషాను కమల్‌ ఎందుకు చంపాలనుకున్నాడు? అనే ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక.. నిద్రలేమి వల్ల హీరో మానసికంగా ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది. ఇక, అంతా అయిపోయింది.. హీరో హీరోయిన్లు వివాహం చేసుకున్నారు. శుభంకార్డు పడబోతుందనుకునేలోపే మరో ట్విస్ట్‌ ఎదురవుతుంది.
           ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన బాబీ సింహా హీరోగా ఈ కథను తన భుజాలపై వేసుకుని, నడిపించారు. ఒత్తిడికి గురైన సాఫ్ట్‌వేర్‌ రుద్ర పాత్రలో ఒదిగిపోయారు. కశ్మీరా పరదేశి అందం, అభినయంతో మెప్పించారు. సీనియర్‌ నటి అయిన రమాప్రభను హోటల్‌లో పనిచేసే వ్యక్తిగా చూపించారంతే. ఆమె పాత్రకు సంభాషణ ఉండదు. ఆర్య అతిథిగా కనిపించినా ఉన్నంతమేర ఆకట్టుకున్నారు. శరత్‌బాబు మరో అతిథి పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనపిస్తాయి. పురుషోత్తమ టేకింగ్‌ బాగుంది.