- రెండు రోజుల్లో పొత్తులు తేల్చాలి
- కాంగ్రెస్‌కు తమ్మినేని అల్టిమేటం
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో:కాంగ్రెస్ చెప్పినట్టుగానే మిర్యాలగూడతో పాటు వైరా అసెంబ్లీ సీట్లను సిపిఎంకు కేటాయించకపోతే లౌకిక శక్తులను కలుపుకొని విడిగా పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రెండురోజుల్లో ఏ నిర్ణయమైంది తెలపకపోతే తమ పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కు వచ్చేది ఉండదని స్పష్టంచేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. లౌకికశక్తుల ఐక్యత కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌ఠాక్రే ప్రతిపాదన పెట్టారని, ఆ ప్రకారం తాము ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ పది సార్లు ఎన్నికలు జరిగితే దానిలో ఎనిమిది సార్లు భద్రాచలం స్థానాన్ని సిపిఎం దక్కించుకుందన్నారు. అయినప్పటికీ ఆ స్థానాన్ని త్యాగం చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను తమ పార్టీ కోరిందన్నారు. ఈ స్థానాలు కాంగ్రెస్‌తో పొత్తు కోసమో.. లేక ఇతర పార్టీలతో పొత్తుకోసమో ఎంపిక చేసినవి కాదని, తమకున్న బలం దృష్ట్యా వీటిని ఎంచుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుంచి ఒక మాట స్పష్టం చేస్తూ వచ్చిందన్నారు. భద్రాచలం తమ సిట్టింగ్ స్థానమని, అక్కడి ఎమ్మెల్యే నిబద్ధతతోని పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పడంతో దాన్ని గౌరవించామని చెప్పారు. త్రిపురలో కాంగ్రెస్ అధ్యక్షులు తమ పార్టీ సిట్టింగ్ సీటును కోరితే ఇచ్చిన ఉదంతాన్ని కూడా ప్రస్తావించామన్నారు. అయినా సరే వారు పట్టుబట్టడంతో భద్రాచలం స్థానాన్ని వదిలేశామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కస్థానమైనా ఇవ్వాల్సిందిగా కోరుతూ పాలేరు సీటు అడిగామన్నారు. ఒక దశలో వారు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత మీడియాలో లీక్‌లు, రకరకాల వార్తలు వచ్చాయన్నారు. ''తమ్మినేని వీరభద్రం పట్టుదలతోనే చర్చలు ఆలస్యమవుతున్నాయి'' అంటూ ఓ పత్రిక రాసిందన్నారు. తాజాగా మరో పత్రిక మిర్యాలగూడ, వైరా రెండుస్థానాలు ఇస్తామంటే కూడా వైరాను కాదని పాలేరు కోసమే సిపిఎం పట్టుబడుతుందని రాసిందని తెలిపారు. ఇవేవీ వాస్తవాలు కాదని వివవరించారు. 27వ తేదీ ఉదయం పాలేరు సీటు ఇవ్వడం కుదరదని చెప్పి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రకటించిందన్నారు. అదేరోజు సాయంత్రం తమ పార్టీ కార్యదర్శివర్గ సమావేశం జరిగిందని తెలిపారు. దానిలో వైరా సీటును అంగీకరిద్దామనే నిర్ణయం జరిగిందని చెప్పారు. ఆ ప్రకారం మిర్యాలగూడ, వైరా సీట్లను తీసుకోవడానికి సిద్ధమయ్యాయమని వివరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఎం సాయిబాబు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి పాల్గొన్నారు.










