Nov 06,2023 08:26

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌:ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) ఆవిర్భావ దినోత్సవం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ వెంకట్రావు కేక్‌ కట్‌ చేసి వేడుకను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 16 ఏళ్లుగా ఫెడరేషన్‌ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూనే ఉందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం తెలపడం జర్నలిస్టులందరికీ తియ్యని కబురేనన్నారు. ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి సంక్రాంతికల్లా జర్నలిస్టులకు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫెడరేషన్‌ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, ఎంబి నాథన్‌ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నామని, జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయబోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇళ్ల స్థలాల కోసం నిరంతరం ఫెడరేషన్‌ తరపున అవిశ్రాంత కృషి చేసిన రాష్ట్ర నాయకులు ఎస్‌ వెంకట్రావు, జి ఆంజనేయులుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిబిజెఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఫెడరేషన్‌ విజయవాడ పశ్చిమ కార్యదర్శి ఫణి, జెవి శ్రీనివాసరావు, బాషా తదితరులు పాల్గొన్నారు.