Oct 08,2023 09:55

న్యూఢిల్లీ : పాటియాలా హౌస్‌ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలను అనుసరించి, న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థకు గురువారం రాత్రి ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందచేశారు. తమపై అందులో పేర్కొన్న వచ్చిన ఆరోపణలు, అభియోగాలన్నీ బూటకం నివని పేర్కొంటూ వాటిని న్యూస్‌క్లిక్‌ ఖండించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని న్యూస్‌క్లిక్‌ తెలిపింది. ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తిలను తక్షణమే పోలీసు కస్టడీ నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలన్నీ మూడు ప్రభుత్వ సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఆదాయపన్ను శాఖ గత కొంతకాలంగా చేస్తున్నవేనని, ఈ ఆరోపణలేవీ కూడా ప్రత్యక్షంగా సమర్ధించలేనివి, బూటకమైనవని పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ ప్రభుత్వ సంస్థలు దర్యాప్తులు కొనసాగిస్తున్నా ఏ ఒక్క చార్జిషీట్‌ను దాఖలు చేయలేదని, ఫిర్యాదులు నమోదు చేయలేదని ఆ ప్రకటన పేర్కొంది. వాస్తవానికి ఈ దర్యాప్తుల నుంచి ప్రబీర్‌కు తాత్కాలిక రక్షణ కల్పించారు. కానీ, ఈ రక్షణను తప్పించడానికే తాజా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని, నిరంకుశ యుఎపిఎ కింద అక్రమంగా అరెస్టు చేశారని ఆ ప్రకటనలో న్యూస్‌క్లిక్‌ పేర్కొంది.
         గతంలో చేసిన ప్రకటనల్లో స్పష్టం చేసినట్లుగా, న్యూస్‌క్లిక్‌ చైనా నుంచి లేదా చైనా సంస్థల నుండి ఎలాంటి నిధులను లేదా ఆదేశాలను అందుకోలేదని ఆ ప్రకట స్పష్టం చేసింది. పైగా హింసను ప్రేరేపించేలా, వేర్పాటువాదాన్ని లేదా ఏ రీతిలోనైనా అక్రమ చర్యలను ప్రోత్సహించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపింది. న్యూస్‌క్లిక్‌ చెబుతున్న విషయాలు వాస్తవమైనవా? కావా? అని నిర్ధారించుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో వున్న న్యూస్‌క్లిక్‌ కవరేజీని చూస్తే సరిపోతుందని పేర్కొంది.
          ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలన్నీ పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొంది. న్యూస్‌క్లిక్‌పై చేపట్టిన చర్యల తీరును చూస్తుంటే భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన పత్రికా రంగం గొంతు నులిమివేయడానికి చేసిన దారుణమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆ ప్రకటన విమర్శించింది.
           ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ప్రబీర్‌, అమిత్‌లు పెట్టుకున్న పిటిషన్‌లను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి విచారణను వాయిదా వేసింది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ పట్ల న్యూస్‌క్లిక్‌కు పూర్తి విశ్వాసం వుందని, తమ వైఖరి సమర్ధించబడుతుందని నమ్మకంగా వున్నట్లు న్యూస్‌క్లిక్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.

                                                అనూష ఇంట్లోనూ సోదాలు : కేరళలో ఢిల్లీ పోలీసుల హల్‌చల్‌

  • న్యూస్‌క్లిక్‌లో లావాదేవీలు చట్టబద్ధం : అమెరికన్‌ సంస్థ డబ్ల్యుఎంహెచ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలో మాజీ న్యూస్‌క్లిక్‌ జర్నలిస్ట్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ బృందం కేరళ పతనాంతిట్టలోని మాజీ న్యూస్‌క్లిక్‌ జర్నలిస్ట్‌ అనూషా పాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. న్యూస్‌క్లిక్‌ ఫండింగ్‌ గురించి, సంస్థతో ఉన్న సమయంలో ఆమె రిపోర్టింగ్‌ అసైన్‌మెంట్‌ల గురించి ప్రశ్నించారు. 'సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ తెలుసా?' అని పోలీసులు తనను ప్రశ్నించినట్లు ఆమె మీడియాకు తెలిపారు. పోలీసులు తన ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ను తీసుకువెళ్లారని, వీలైనంత త్వరగా న్యూఢిల్లీలోని తమ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పారని వివరించారు. అనూషాపాల్‌ 2018 నుంచి 2022 వరకు న్యూస్‌క్లిక్‌లో పనిచేశారు. ప్రస్తుతం వికలాంగుల హక్కుల కోసం జాతీయ వేదిక రీసెర్చర్‌గా ఉన్నారు.
 

                                                            చట్టబద్ధంగానే పెట్టుబడులు: డబ్ల్యుఎంహెచ్‌

న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు, లావాదేవీలన్నీ చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉన్నాయని అమెరికన్‌ సంస్థ వరల్డ్‌వైడ్‌ మీడియా హోల్డింగ్స్‌ (డబ్యుఎంహెచ్‌) పేర్కొంది. డబ్ల్యుఎంహెచ్‌ని పీపుల్స్‌ సపోర్ట్‌ ఫౌండేషన్‌ నియంత్రిస్తుంది. పీపుల్‌ - సెంట్రిక్‌ జర్నలిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు పెట్టినట్లు డబ్ల్యుఎంహెచ్‌ మేనేజర్‌, అమెరికన్‌ లాయర్‌ జాసన్‌ ఫెచర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్‌క్లిక్‌ జర్నలిజం శైలిపై ఆసక్తి కనబరిచిన తరువాత 2017లో పెట్టుబడి ప్రక్రియ ప్రారంభమైందని ఫెచర్‌ వివరించారు. ప్రబీర్‌ పుర్కాయస్థ 'ఆలోచనలు'తో ఏకీభవిస్తున్నా మని, న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థతో చర్చించామని చెప్పారు. ఒక సంవత్సరం పాటు సంప్రదింపులు, నియంత్రణ ప్రక్రియ తరువాత, పెట్టుబడిదారులు చివరకు అంగీకరించారని తెలిపారు. న్యూస్‌క్లిక్‌కి మీడియా పనిపై ఎలాంటి సలహా ఇవ్వలేదని పేర్కొన్నారు.. డబ్ల్యుఎంహెచ్‌ ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం, వారి ప్రతినిధుల నుంచి ఎటువంటి డబ్బును స్వీకరించలేదని పేర్కొన్నారు. 'న్యూయార్క్‌ టైమ్స్‌' ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా అమాయకులను అరెస్టు చేశారని విమర్శించారు. భారతదేశ చట్టం ప్రకారం దేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు.