Oct 01,2023 11:19

న్యూఢిల్లీ : పోలీసు ఎన్‌కౌంటర్లన్నీ ఆత్మరక్షణ చర్యలేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా యుపిలో ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా విమర్శిస్తున్నా యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం అడ్డగోలుగా సమర్ధించుకుంది. వీటిపై సక్రమంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది. పోలీసుల చర్య విచారణకు సంబంధించి 286 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందజేసింది. ''నిందితులు మరణించిన ఘటనల్లో పోలీసుల ఆత్మరక్షణ చర్యలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాం. 2017 నుంచి చోటు చేసుకున్న పోలీసు ఎన్‌కౌంటర్‌ ఘటనల్లో హత్యకు గురైన నేరస్తులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు ఫలితాలు అన్నింటినీ సేకరించాం, ప్రతి నెలా పోలీసు ప్రధాన కార్యాలయంలో వాటిని పరిశీలిస్తాం. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అసమర్థనీయమైనవి.'' అని యుపి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేశారు. గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నేతగా మారిన అతిక్‌ అహ్మద్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆయన సోదరి ఆయేషా నూరీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం ఈ నివేదికను అందజేసింది. ఏప్రిల్‌లో రోజుల వ్యవధిలో తన సోదరులిద్దరి, మేనల్లుడి హత్యకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులే కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.