Aug 17,2023 22:06

జితేశ్‌ ఇన్‌.. సంజు ఔట్‌..
రింకూ అరంగేట్రం పక్కా..
నేడు ఐర్లాండ్‌తో తొలి టి20
రాత్రి 7.30గం||ల నుంచి
ఐర్లాండ్‌: ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత యువ క్రికెటర్ల జట్టు డబ్లిన్‌ వేదికగా శుక్రవారం జరిగే తొలి టి20తో జస్ప్రీత్‌ బుమ్రా ఏడాదిన్నర తర్వాత మళ్లీ బంతిని అందుకోనున్నాడు. కీలక ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ల ముందు బుమ్రాకు ఈ సిరీస్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. రెండు మెగా టోర్నీల నేపథ్యంలో ఈ సిరీస్‌కు టీమిండియా కీలక ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. ఈ పర్యటనకు వికెట్‌ కీపర్‌గా ఎంపికైన సంజు శాంసన్‌ స్థానంలో జితేశ్‌ శర్మ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే ఐపిఎల్‌లో మెరిసిన రింకూ సింగ్‌, వెస్టిండీస్‌ పర్యటనల్లో రాణించిన తిలక్‌ వర్మలకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. అలాగే గైక్వాడ్‌, దూబే, రవి బిష్ణోరు, ఆవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌లతో టీమిండియా దుర్భేద్యఫామ్‌లోనే ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే ఆసియాకప్‌కు ఎంపికైన ఆటగాళ్లు బెంగళూరు వేదికగా నిర్వహించనున్న శిక్షణా శిబిరంలో పాల్గననున్నారు. రెండో రోజుల శిక్షణ అనంతరం ఆసియాకప్‌ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ మ్యాచ్‌లు స్పోర్ట్స్‌ా18 చానెల్‌తో పాటు జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. ఈ సిరీస్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న రింకూ సింగ్‌పై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా వెస్టిండీస్‌ పర్యటనలో సత్తా చాటిన తిలక్‌ వర్మ ఈ సిరీస్‌లో కూడా రాణిస్తే.. ఆసియాకప్‌ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
జట్లు(అంచనా)..
భారత్‌: బుమ్రా(కెప్టెన్‌), గైక్వాడ్‌, జైస్వాల్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌కీపర్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, దూబే, సుందర్‌, ఆర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, బిష్ణోరు.
ఐర్లాండ్‌: స్టెర్లింగ్‌(కెప్టెన్‌), బల్‌బిర్నీ, టక్కర్‌(వికెట్‌ కీపర్‌), హారీ టక్కర్‌, గరెత్‌ డెలానీ, ఛాపర్‌, డోక్రెల్‌, అడైర్‌, మెక్‌ కర్టీ, జోషూ లిట్టిల్‌, క్రెగ్‌ యంగ్‌/వోక్రోమ్‌.