Nov 01,2023 16:37

అమరావతి : రాష్ట్రంలో సుమారు 300 మండలాలలో కరువు పరిస్థితులుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నది. కరువుకు గురైన అన్ని మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలి. కేంద్రం కరువు పరిశీలనా బందాలను పంపి, ప్రకతి వైపరీత్యాల నిధిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో 17 మండలాలలో కరువు పరిస్థితులు ఉంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. ప్రకాశం జిల్లాలో 38 మండలాలో 30 మండలాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. అయినా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. బాపట్ల జిల్లాలో అద్దంకి, కొరిశపాడు, బల్లికురువ, సంతమావులూరు, పంగులూరు, మార్టూరు వంటి 6 మండలాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నాయి. అయినా కరువు మండలాల ప్రకటనలో చేర్చలేదు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు 18 మండలాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, చాట్రాయి, వేలేరుపాడు, కుక్కనూరు వంటి 4 మండలాలో తీవ్రమైన కరువు పరిస్థితులు వున్నాయి. హొమరొక 7 మండలాలు పాక్షికంగా కరువు వాత పడ్డాయి. అయినా కరువుగా గుర్తించలేదు. సత్యసాయి జిల్లాలో 31 మండలాలలో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 21 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించి 11 మండలాలను విస్మరించారు. అనంతపురం జిల్లాలో 3 మండలాలను విస్మరించారు. నెల్లూరు జిల్లాలో 38 మండలాలలో 20 మండలాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.
హొహొ హొకరువు మండలాల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొలబద్దలు ఏమిటో ప్రకటించకుండా కేవలం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం గర్హనీయం. ప్రభుత్వం విస్మరించిన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.